SBI E Rupee Wallet News :ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ వినియోగదారులకు శుభవార్త వినిపించింది. డిజిటల్ రూపాయికి సంబంధించి నూతన సదుపాయాన్ని ప్రారంభించింది. అన్ని రకాల మర్చెంట్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి డిజిటల్ రూపీని (CBDC) పేమెంట్స్‌కు వినియోగించేకునేందుకు వీలుగా యూపీఐ ఇంటర్-ఆపరేబిలిటీ సదుపాయాన్ని తమ కస్టమర్స్‌కు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఎస్‌బీఐ ఇ-రూపీ (e-Rupee) యాప్ వాడుతున్న వారు ఇకపై యూపీఐని స్కాన్ చేసి ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని ఎస్‌బీఐ సోమవారం వెల్లడించింది. తమ వినియోగదారులకు డిజిటల్ సౌలభ్యాన్ని మరింత చేరువచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా, తాజాగా తీసుకువచ్చిన ఈ ఫీచర్‌ను ఎస్‌బీఐ ఇ-రూపీ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు. ( SBI Latest News On Digital Rupee )
డిజిటల్ రూపీ వినియోగం!
SBI E Rupee :ఇంతకుముందు పలు ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా ఈ సౌలభ్యాన్ని తీసుకువచ్చాయి. ముందుగా హెచ్‌డీఎఫ్‌సీ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సైతం ఇంటర్-ఆపరేబిలిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. కాగా, తాజా ప్రకటనతో ఎస్‌బీఐ కూడా ఆ జాబితాలోకి చేరినట్లయింది. దీని ద్వారా యూపీఐ లావాదేవీల కోసం క్యూఆర్ కోడ్‌లను వినియోగిస్తున్న వ్యాపారులు.. తమ రోజువారీ వ్యాపార లావాదేవీల్లో ఇకపై డిజిటల్ రూపాయిని సైతం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.