తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2022, 11:04 PM IST

ETV Bharat / business

ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్​ రివార్డు పాయింట్లలో కోత.. జనవరి నుంచే అమలు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డులు వాడే వారికి అలర్ట్. రివార్డు పాయింట్ల ప్రోగ్రాములో ఎస్‌బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. అవేంటంటే?

sbi card slashes reward points
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రివార్డు పాయింట్లు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డులు వాడే వారికి అలర్ట్. రివార్డు పాయింట్ల ప్రోగ్రాములో ఎస్‌బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై ప్రస్తుతం ఇస్తున్న రివార్డు పాయింట్లలో కోత పెట్టింది. జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం రివార్డు పాయింట్ల విషయంలో కొన్ని పరిమితులు విధించింది. ఎస్‌బీఐ సైతం ఇప్పుడు అదే బాట పట్టింది.

ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌సైట్‌లో సింప్లీక్లిక్‌, సింప్లీ అడ్వాంటేజ్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లపై 10X రివార్డు పాయింట్లు లభించేవి. జనవరి 1 నుంచి వీటి ద్వారా కొనుగోళ్లపై 5X మాత్రమే రానున్నాయి. అపోలో 24×7, బుక్‌మై షో, క్లియర్‌ట్రిప్‌, ఈజీడైనర్‌, లెన్స్‌కార్ట్‌, నెట్‌మెడ్స్‌ ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై మాత్రం ఎప్పటిలానే 10X రివార్డులు లభించనున్నాయని ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది. అలాగే సింప్లీ క్లిక్‌ కార్డుహోల్డర్లకు జారీ చేసిన క్లియర్‌ట్రిప్‌ వోచర్లను ఇకపై ఒకే లావాదేవీకి అనుమతించనున్నారు. పైగా ఇతర ఏ ఆఫర్లతోనూ గానీ, వోచర్లతో గానీ కలిపి వినియోగించడానికి వీల్లేదని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జనవరి 6 నుంచి ఈ రూల్‌ అమల్లోకి రానుందని తెలిపింది.

ఎస్‌బీఐ నవంబర్‌ 15 నుంచి ఈఎంఐ లావాదేవీలపై ఉన్న ఛార్జీలను సవరించింది. గతంలో ఈఎంఐ లావాదేవీపై రూ.99గా ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజును రూ.199కు పెంచింది. అలాగే అద్దె చెల్లింపులపై రూ.99 ఫీజుగా వసూలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details