తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ 6 సూత్రాలు పాటిస్తే మీ ఆదాయం డబుల్! - షేర్​ మార్కెట్

Saving Tips and Tricks: తక్కువ నష్టభయంతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి మంచి ప్రతిఫలాలు అంటే స్థిరమైన ప్రతిఫలాలను పొందడం అన్నది ఒక కళ. లాభాలబాట పట్టాలంటే ఈ ఆరు సూత్రాలు పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు. మరి ఆ సూత్రాలు ఏంటో తెలుసుకుందాం.

biz
biz

By

Published : Apr 24, 2022, 5:37 AM IST

Saving Tips and Tricks: మన దేశంలో స్టాక్‌ మార్కెట్లలోకి వచ్చే రిటైల్‌ మదుపర్ల సంఖ్య చాలా తక్కువ. ప్రపంచంలోనే అత్యంత కనిష్ఠమని చెప్పాలి. చాలా మంది చిన్న మదుపర్లు షేర్లలోకి దిగకుండా.. మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడానికే మొగ్గు చూపిస్తారు. షేర్లతో కూడిన పోర్ట్‌ఫోలియోలను నిర్మించుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. దానికి కారణం నష్టభయమే. తక్కువ నష్టభయంతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి మంచి ప్రతిఫలాలు అంటే స్థిరమైన ప్రతిఫలాలను పొందడం అన్నది ఒక కళ. అది నేర్చుకోవడానికి ఈ ఆరు సూత్రాలు పాటిస్తే సరి.

1. షేర్లు ఎపుడూ కొనొద్దు..వినడానికి విచిత్రంగా ఉందా? పెట్టుబడుల నియమాల్లో ఇది అతి ప్రాథమిక సూత్రం. ఏదైనా షేరును కొనుగోలు చేయడం కంటే ఆ వ్యాపారంలో భాగస్వామిగా వ్యవహరించాలి. అర్థం కాలేదా? ఇది చాలా సరళమైన అంశమే. ఎలాగంటే.. మనం ఏవైనా షేర్లను కొనుగోలు చేయడానికీ.. ఆ కంపెనీలో భాగస్వామిగా చేరామని అనుకుని షేర్లను తీసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముందుగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. సదరు కంపెనీ మేనేజ్‌మెంట్‌ బాగుందా? ఆ కంపెనీ ఉన్న రంగానికి వృద్ధి అంచనాలు ఎలా ఉన్నాయి? ఆ కంపెనీ పరిశ్రమలో నాయకత్వ స్థానంలో ఉందా? ఆ స్థానం స్థిరంగా కొనసాగగలదా? కార్పొరేట్‌ పాలన ఎలా ఉంది? బ్యాలెన్స్‌ షీట్లు ఎలా ఉన్నాయి? ఇలా లోతుగా వెళ్లి మనదైన కసరత్తు చేయాలి.

2. 'నాణ్యత'లో పెట్టుబడి పెట్టండి:ఎపుడూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. నాణ్యత అంటే ఇక్కడ మనం షేర్లు కొనుగోలు చేసే కంపెనీని ఒక పోటీతత్వం ఉన్న యాజమాన్యం నడుపుతోందా లేదా చూసుకోవాలి. కొన్నేళ్లుగా దాని ట్రాక్‌ రికార్డు ఎలా ఉందో చూడాలి. కార్పొరేట్‌ పాలన విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించి ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ‘మెరుగ్గా.. స్వచ్ఛంగా’ ఉండి ఉండాలి. ఇటువంటి ఒక కంపెనీని గుర్తించడం చెప్పడం సులభమే కానీ గుర్తించడమే కష్టం. ఎందుకంటే ఈ పరీక్షల్లో నిలబడే కంపెనీలు చాలా తక్కువగానే ఉంటాయి. అయితే ఈ సూత్రాల్ని ఎపుడూ పాటించాలి. అప్పుడే ప్రతిఫలాల్లో స్థిరత్వం కనిపిస్తుంటుంది.

3. దీర్ఘకాలానికి పెట్టుబడులు:ఈక్విటీల్లో డబ్బులు సంపాదించాలంటే దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టాల్సిందే. ఈక్విటీ మార్కెట్లలోని ప్రయోజనాలను పూర్తిగా మనం దక్కించుకోవాలంటే ఎక్కువ కాలం పాటు వేచిచూడడం తప్ప మరో మార్గం లేదు. ఏదైనా కంపెనీతో మనం భాగస్వామ్యం కుదుర్చుకున్నామంటే.. అది దీర్ఘకాలం పాటు అని ముందే గుర్తుపెట్టుకోవాలి. అపుడపుడూ అనూహ్యంగా స్వల్పకాల లాభాలు మనల్ని ఊరిస్తాయి. అయితే మన దృష్టి మరలకూడదు. క్రమశిక్షణను తప్పకూడదు.

4. చిలికే కవ్వం కిందనే ఉంచాలి:మనం మజ్జిగను చిలికేటపుడు కవ్వాన్ని ఆసాంతం కిందకు దించాలి. అపుడే ప్రయోజనం ఉంటుంది. ఇదే సూత్రం ఈక్విటీలకు వర్తిస్తుంది. మంచి పోర్ట్‌ఫోలియో అత్యంత అవసరం. సరైన కంపెనీలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అపుడే నష్టభయం దానంతట అదే తగ్గుతుంది. నష్టభయాన్ని తక్కువగా ఉంటే కంపెనీలను ఎంచుకుంటే సాధారణంగానే స్థిరమైన లాభాల వృద్ధి కనిపిస్తుంది. కవ్వం కింద ఉండి ఎంతలా పనిచేస్తుందో.. అంతలా ఈ మెరుగైన కంపెనీలు మనకు లాభాలు తెచ్చిపెడతాయన్నమాట. ఏదైనా మంచి షేరును అమ్మాల్సి వచ్చింది అంటే కేవలం ఆ వ్యాపార మూలాలు పూర్తిగా మారి మనకు నష్టభయం వస్తుందని అనిపించినపుడే బయటపడాలి. కేవలం స్వల్పకాల మార్కెట్‌ చలనాలను చూసి ఎపుడూ మంచి షేరును అమ్ముకోకూడదు.

5. మీ అవసరాన్ని గుర్తించండి:చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే అది ఎందుకోసం అన్నది మనసులో ఉంచుకోరు. ప్రతిఫలం అన్నది మన ప్రాథమిక లక్ష్యం కాదు. పెట్టుబడి ఎందుకు పెట్టామన్నదే మన లక్ష్యం. మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఇది. మనం ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాం. మన పెట్టుబడులకు, మన అవసరాలకు మధ్య అనుసంధానం చేయడం అత్యంత కీలకం. మీకు అవసరం ఒకటి ఉండి.. మీరు మెరుగ్గా పెట్టుబడులు పెట్టినా.. ఆ అవసరం ఉన్న సమయానికి అవి ఉపయోగపడకపోతే ఏం లాభం చెప్పండి. కాబట్టి.. డబ్బులు పట్టుకుని అవి ఎందుకు పెట్టుబడులు పెడుతున్నామో తెలుసుకోకుండా స్టాక్‌ మార్కెట్ల వైపు అడుగులు వేయకండి.

6. బీ2సీ లేదా బీ2బీ:బీ2బీ(బిజినెస్‌ టు బిజినెస్‌) వ్యాపారాలతో పోలిస్తే దీర్ఘకాలంలో బీ2సీ(బిజినెస్‌ టు కన్జూమర్‌) వ్యాపారాలే ఈక్విటీల్లో మెరుగైన ప్రతిఫలాలను ఇచ్చాయి. అది చరిత్ర చెబుతోంది. 1994 నుంచి 2019 మధ్య సమాచారాన్ని క్రోడీకరించినపుడు దీర్ఘకాల పెట్టుబడులు స్థిరమైన లాభాలను ఇచ్చాయి. వీటిల్లో ఉన్న పోర్ట్‌ఫోలియోలు మార్కెట్లకు మించి రాణించాయి.

ఈ ఆరు సూత్రాలను మీరు పాటిస్తే మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి. అయితే దీర్ఘకాలంలోనే అన్న మాటను మరచిపోకూడదు. చాలా మంది అనుకుంటున్నట్లు పెట్టుబడులు పెట్టడం అంత కష్టమైన విషయం కాదు. కొంత సమయం, అంతకు మించిన క్రమశిక్షణ అవసరం అంతే.

- మనీశ్‌ జైన్‌, ఫండ్‌ మేనేజర్‌, యాంబిట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్

ఇదీ చూడండి:విక్రయానికి రూ.70,000 కోట్లు విలువ చేసే షేర్లు.. కొనేదెవరు?

ABOUT THE AUTHOR

...view details