Sam Altman OpenAI Microsoft :ప్రముఖ కంపెనీ ఓపెన్‌ఏఐ తనపై విశ్వాసం కోల్పోవడం వల్ల ఆ సంస్థ సీఈఓ పదవీ బాధ్యతల నుంచి తొలగించిన నేపథ్యంలో శామ్ ఆల్ట్‌మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలోనే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లోని కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నట్లు స్వయంగా ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం వెల్లడించారు. ఈ విషయాన్ని ఆల్ట్‌మన్ సైతం ధ్రువీకరించారు. కాగా, శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేశారు.
"ఆల్ట్‌మన్ మా కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారు. ఆయనతో పాటు ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నారు. ఓపెన్‌ఏఐ నూతన సీఈఓగా షియర్ నియామకం వాస్తవం. వీరితో మా భాగస్వామ్యం కొనసాగుతుంది. సంస్థతో కలిసి మేము రూపొందించిన ప్రోడక్ట్ రోడ్‌మ్యాప్ ముందుకు సాగుతుంది. ఓపెన్‌ఏఐలో వచ్చిన కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము."
- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
'వనరులు సమకూరుస్తాం..'
Greg Brockman Microsoft :ఇక ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్ రాకతో మైక్రోసాఫ్ట్‌లోని ఏఐ టీమ్‌కు కొత్త నాయకత్వం లభించనున్నట్లు సత్య నాదెళ్ల పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి కృత్రిమ మేధ పరిశోధన బృందానికి నేతృత్వం వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో వారి విజయానికి కావాల్సిన అన్నీ వనరులు సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అందుకు తగ్గట్లు వేగంగా చర్యలు కూడా చేపడతామని నాదెళ్ల ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఇక ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న విషయం తెలిసిందే.