Fixed Deposits VS Treasury Bills : మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటూనే.. స్థిరమైన ఆదాయం పొందాలని అనుకుంటున్నారా? అయితే దీనికి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకం బెస్ట్ ఛాయిస్. డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా అది మెచ్యూర్ అయ్యే సమయానికి అసలుతో పాటు వడ్డీ సైతం పొందవచ్చు. పలు నివేదికల ప్రకారం.. ప్రజలు ఏటా సుమారు రూ.60 ట్రిలియన్లు (రూ.60 లక్షల కోట్లు) పెట్టుబడిగా పెడతున్నారట. ఇందులో 15 శాతం ఫిక్స్డ్ డిపాజిట్, బంగారం రూపంలోనే ఉన్నాయని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Treasury Bills Maturity Period : సురక్షితమైన పెట్టుబడి కోసం కేవలం ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మాత్రమే కాకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ట్రెజరీ బిల్స్ లాంటి మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి. తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటూనే.. అధిక రాబడి రావాలని కోరుకునే వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ టీ-బిల్స్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ టీ-బిల్స్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇది ఒక మనీ మార్కెట్ సాధనంగా ఉపయోగపడుతుంది. దీని స్కీమ్‌లో పెట్టే పెట్టుబడులను భవిష్యత్తులో మనకి తిరిగి చెల్లించడానికి ప్రామిసరీ నోట్‌ను జారీ చేస్తారు. వీటిని జీరో కూపన్ సెక్యూరిటీస్ అని కూడా అంటారు.
అధిక వడ్డీని పొందొచ్చు..
Treasury Bills Interest Rates : ఈ టీ-బిల్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి వారం జారీ చేస్తుంది. ఇవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల మెచ్యూరిటీ పీరియడ్‌తో ఉంటాయి. 3 నెలలు, 12 నెలల కాల పరిమితి గల ఈ టీ-బిల్స్‌పై 6.7 శాతం వడ్డీని పొందొచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జారీ చేస్తారు కనుక ఎటువంటి రిస్క్ ఉండదు. పైగా వీటిని డిస్కౌంట్ రేటుతో అందిస్తారు. ఒక్కసారి మెచ్యూరిటీ టైమ్ అయిపోయిన తర్వాత ఈ టీ-బిల్స్ మీ డీమ్యాట్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతాయి. ఫేస్ వ్యాల్యూ మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
రెండింటి మధ్య తేడా ఇది..
Treasury Bills Vs Fixed Deposit : ఎఫ్డీలో పెట్టుబడి పెట్టేందుకు కనీస పెట్టుబడి పారామితులు ఉండాలి. ఈ ఖాతాను కేవలం రూ.1000తో ఓపెన్ చేసుకోవచ్చు. కానీ, అదే టీ-బిల్స్ కోసం అయితే కనీసం రూ.25 వేలు కావాలి. వీటిని రూ.25 వేల గుణిజాల్లో మాత్రమే జారీ చేస్తారు. ఎఫ్డీలో వడ్డీ రేట్లు మార్కెట్ స్థితి, సదరు సంస్థపై ఆధారపడి ఉంటుంది. కానీ టీ-బిల్స్ విషయంలో.. వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. వీటి నుంచి పొందిన లాభం స్వల్పకాలిక మూలధన లాభం (షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్)గా పరిగణిస్తారు. అంతే కాకుండా స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను కూడా వర్తిస్తుంది.
T bills RBI Retail : ట్రెజరీ బిల్లులను సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. అలాగే వీటిని మెచ్యూరిటీకి ముందే సెకండరీ మార్కెట్లో విక్రయించవచ్చు. అదే ఫిక్స్డ్ డిపాజిట్విషయంలో ఇలా ఉండదు. వీటికి నిర్ణీత వ్యవధి ఉంటుంది. మెచ్యూరిటీ కంటే ముందు డబ్బు విత్‌డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. మొదట్లో టీ-బిల్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మాత్రమే అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు రిటైల్ పెట్టుబడిదారులకు కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి.