Russia Ukraine IT Companies: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 2 నెలలకు పైగా కొనసాగుతుండటంతో, అక్కడి కార్యకలాపాలను భారత్ సహా ఇతర దేశాలకు తరలించడంపై ఐటీ కంపెనీలు దృష్టి సారించాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో, ఆ 2 దేశాల్లో నిర్వహిస్తున్న ఐటీ ప్రాజెక్టులను వేరే ప్రాంతాలకు బదిలీ చేసేందుకు చూస్తున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు రష్యా, ఉక్రెయిన్ దేశాల్లోని తమ ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలను తాత్కాలికంగా మనదేశానికి మళ్లించే వీలుందని సమాచారం. 'భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ దేశాలకూ ఐటీ ప్రాజెక్టులు తరలిపోతాయని' ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కన్సల్టింగ్ సేవల సంస్థ ఆటోస్ వెల్లడించింది. 'రష్యాలో ఐటీ కార్యకలాపాలు కొనసాగించలేం.. అక్కడ నిర్వహిస్తున్న ప్రాజెక్టులను భారత్, టర్కీకి మళ్లిస్తాం' అని స్పష్టం చేసింది. ఇలా వచ్చే ప్రాజెక్టుల్లో కొన్ని హైదరాబాద్‌కు చేరతాయని, ఇందువల్ల ఇక్కడ ఐటీ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఏర్పడుతుందని స్థానిక ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ విభాగాల్లో:ఇంజినీరింగ్ పరిశోధన- అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్, బ్యాక్ ఆఫీస్ నిర్వహణ, కస్టమర్ సపోర్ట్ - మెయింటెనెన్స్, షేర్డ్ సర్వీసెస్ విభాగాల ఉద్యోగాలు ఇక్కడకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మనదేశంలో కొత్తగా 50,000 - 60,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. యుద్ధం ముగిసినా కూడా కొన్ని ప్రాజెక్టులను సంబంధిత క్లయింట్లు మనదేశంలోనే కొనసాగించే అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడి ఐటీ రంగానికి, నిపుణులకు మేలు జరుగుతుంది.
ఈ దేశాల నుంచి:తూర్పు ఐరోపా దేశాలైన రుమేనియా, బల్గేరియా, మాల్డోవా, పోలెండ్‌తో పాటు బెలారస్, ఈస్తోనియా, లాత్వియా, లిథుయేనియా వంటి దేశాలు తమ ఐటీ అవసరాల కోసం ఉక్రెయిన్, రష్యా దేశాల మీద అధికంగా ఆధారపడి ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు కూడా రష్యా, ఉక్రెయిన్‌లలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. యుద్ధ పరిణామాల్లో ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను అక్కడ సజావుగా నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. అందుకే ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాజెక్టులు వచ్చే 6 నెలల వ్యవధిలో మనదేశానికి వస్తాయని స్థానిక ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి.
ఐరోపా దేశాలకు మన ఐటీ ఎగుమతులు 25 శాతం:మనదేశం నుంచి ఐటీ కంపెనీలు నమోదు చేస్తున్న ఎగుమతుల్లో ఐరోపా దేశాల వాటా 20- 25 శాతం వరకు ఉంటోంది. ఇందులో సింహభాగం పశ్చిమ ఐరోపా దేశాలదే. ఇటీవల కాలంలో తూర్పు ఐరోపా దేశాల్లో ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలు ప్రారంభించడం, డెలివరీ కేంద్రాలు నెలకొల్పడం లేదా అక్కడి కొన్ని చిన్న- మధ్యస్థాయి కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా త్వరగా ఆయా దేశాల్లో విస్తరించే ప్రయత్నం చేస్తున్నాయి. రష్యాకు, తూర్పు ఐరోపాకు వారధిగా ఉండే ఉక్రెయిన్‌లో ఐటీ కంపెనీల కార్యకలాపాలు గత కొన్నేళ్లలో బాగా పెరిగాయి. యుద్ధం వల్ల మళ్లీ పరిస్థితులు తారుమారవుతున్నాయి. యుద్ధం మరింతకాలం కొనసాగితే ఆ రెండు దేశాల నుంచి ఐటీ కంపెనీలు, ఐటీ ప్రాజెక్టులను మనదేశానికి మళ్లిస్తాయని స్థానిక హెచ్‌ఆర్ సేవల సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. మనదేశానికి వచ్చే ప్రాజెక్టుల్లో అయిదో వంతు అయినా హైదరాబాద్‌కు దక్కుతాయని, ఇక్కడ నిపుణుల లభ్యతే ఇందుకు కారణమని విశ్లేషించారు.
ఇదీ చదవండి:గంటల్లో లక్షల కోట్లు కోల్పోయిన అమెజాన్ బాస్