తెలంగాణ

telangana

ETV Bharat / business

వచ్చే వారం నుంచే ఇండియా-రష్యా వాణిజ్యం రూపాయల్లో

వచ్చే వారం నుంచే రష్యాతో వాణిజ్య చెల్లింపులు రూపాయల్లో జరగనున్నాయి. దేశం నుంచి ఔషధాలు, వాహన విడిభాగాలు దిగుమతి చేసుకునేందుకు రష్యా నుంచి డిమాండ్లు రావడమే ఇందుకు నేపథ్యం. దీంతో రష్యాతో భాతర వాణిజ్య లోటును తగ్గించేందుకు వీలవుతుంది.

russia india rupee trade
రష్యా ఇండియా రూపాయి వాణిజ్యం

By

Published : Dec 13, 2022, 7:59 AM IST

Updated : Dec 13, 2022, 9:08 AM IST

India Russia Rupee Trade : రష్యాతో వాణిజ్య చెల్లింపులు వచ్చే వారం నుంచి రూపాయల్లో జరగనున్నాయి. మన దేశం నుంచి ఔషధాలు, వాహన విడిభాగాలు ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు రష్యా నుంచి డిమాండ్లు రావడం ఇందుకు నేపథ్యమని ఆంగ్ల పత్రిక ఒకటి పేర్కొంది. "రూపాయల్లో లావాదేవీల కోసం ఎగుమతిదార్లు, దిగుమతిదార్లు ప్రత్యేక వాస్ట్రో ఖాతాలను ప్రారంభించేందుకు బ్యాంకులకు వెళ్తున్నారు. కొన్ని షిప్‌మెంట్లకు వచ్చే వారం నుంచే రూపాయి చెల్లింపు వ్యవస్థ అందుబాటులోకి వస్తుంద"ని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఫియో) డైరెక్టర్ల జనరల్‌ పేర్కొనట్లు ఆ కథనం పేర్కొంది.

పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యాకు భారత ఎగుమతులను చేరవేయడం కష్టంగా మారిన తరుణంలో, తాజా చర్యల వల్ల రష్యాతో భారత వాణిజ్య లోటును తగ్గించేందుకు వీలవుతుందని నిపుణులు అంటున్నారు. రష్యా నుంచి మన దేశానికి చమురు దిగుమతులు ఈ ఏడాది మార్చి నుంచి బాగా పెరిగాయి.

ప్రస్తుతం 4 శాతం అదనపు భారం
రష్యా, భారత్‌ల మధ్య వాణిజ్య సెటిల్‌మెంట్లకు ఎస్‌బర్‌ బ్యాంక్‌ 4 శాతం అదనంగా ఛార్జీ విధిస్తోంది. మన ఎగుమతిదార్లు ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. రూపాయి చెల్లింపుల వల్ల మన ఎగుమతిదార్లకు ఆ భారం తగ్గుతుంది. రూపాయల్లో సెటిల్‌మెంట్‌ కోసం వాస్ట్రో ఖాతాలను తెరవడానికి 5-6 బ్యాంకులకు అనుమతి దక్కిందని, ఇప్పటిదాకా 10-11 ఖాతాలు మొదలైనట్లు వివరించింది.

"రష్యాకు మన ఎగుమతులతో పోలిస్తే మన దిగుమతులు 10 రెట్లు ఎక్కువ. అయితే మన ఎగుమతులను పెంచడానికి మంచి అవకాశాలున్నాయి. ఎందుకంటే వారి వద్ద మన రూపాయలున్నపుడు, భారత్‌లో వాటిని పెట్టుబడులుగా పెట్టే అవకాశం ఉంద"ని ఒక అధికారి పేర్కొన్నట్లు ఆ వార్తా సంస్థ వెల్లడించింది.

భారత నిర్ణయాన్ని ఆహ్వానించిన రష్యా..
రష్యా చమురుపై జి7, అనుబంధ దేశాలు డిసెంబరు 5న విధించిన ధరల పరిమితిని సమర్థించరాదని భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా ఆహ్వానించింది. ఈ దశలో భారీ సామర్థ్యం ఉండే నౌకల నిర్మాణానికి, లీజింగ్‌, సహకారాన్ని ఇస్తామని భారత్‌తో రష్యా పేర్కొంది. రష్యాలో భారత రాయబారి పవన్‌ కపూర్‌తో జరిగిన సమావేశంలో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నొవాక్‌ ఆ మేరకు ప్రతిపాదించారు. ఎక్కడైతే చమురు తక్కువ ధరకు లభిస్తుందో అక్కడి నుంచో కొనుగోళ్లు చేపడతామని ఇప్పటికే భారత్‌ ప్రపంచానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Dec 13, 2022, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details