Rupee Impact On Foreign Education: హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీ చైనా నుంచి ముడి ఔషధాలు దిగుమతి చేసుకుని, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్లు), తుది ఔషధాలు ఉత్పత్తి చేసి, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కొవిడ్ పరిణామాల్లో రవాణా ఛార్జీలు, అన్ని రకాల ముడిపదార్థాల ధరలు పెరిగి ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా.. రూపాయి మారకపు విలువ బాగా తగ్గడంతో ఈ సంస్థ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లైంది.
- వెంకట్రావు ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబం. బీటెక్ పూర్తిచేసిన కూతురు అమెరికాలో ఎంఎస్ చేస్తానంటే, గత డిసెంబరులో పంపించారు. అప్పడు డాలర్ విలువ రూ.75- 76 వద్ద ఉంది. ఒక టర్మ్ ఫీజు చెల్లించారు. రెండో టెర్మ్ ఫీజు చెల్లించాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడేమో డాలర్ రూ.82కు సమీపిస్తోంది. ప్రతి డాలర్‌కు ఆరేడు రూపాయల వ్యత్యాసం వల్ల, ఫీజుగా చెల్లించాల్సిన మొత్తం రూ.1- 1.5 లక్షల మేర పెరిగినట్లయిందని వాపోతున్నారు.
- హైదరాబాద్‌లోని నలుగురు మిత్రులు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీసాలు కూడా రావడంతో, విమాన టిక్కెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకుందామని అనుకున్నారు. అయితే రూపాయి విలువ పతనం కావడంతో, అంచనా వేసుకున్న ఖర్చు బాగా పెరుగుతున్నందున, పర్యటన వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఏడాది వ్యవధిలో 75 నుంచి 82కు పతనమవుతోంది. అంటే ప్రతి డాలర్ రూపేణ చెల్లింపులకు రూ.7 మేర అదనంగా వెచ్చించాల్సిందే. కరెన్సీ విలువ 10 శాతం క్షీణించడంతో, దిగుమతులపై ఆధారపడిన వ్యాపార సంస్థలకు ఖర్చులు పెరిగి, లాభాలు హరించుకుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఫార్మా, మరికొన్ని ఇతర రంగాల పరిశ్రమలు ముడిపదార్థాలు, విడిభాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ సంస్థలన్నింటికీ ప్రస్తుత పరిస్థితులు కష్టాలు తెస్తున్నాయి. విదేశీ చదువులకు పిల్లలను పంపించిన తల్లితండ్రుల బాధలు వర్ణనాతీతం. కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు బ్యాంకు నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకుని పిల్లల్ని అమెరికా, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు పంపించడం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ.
పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశతో దిగువ - మధ్యతరగతి, కుటుంబాల వారు ఎక్కువగా తమ పిల్లలను విదేశీ చదువులకు పంపుతున్నారు. ఇక్కడ రూపాయల్లో అప్పు తీసుకుని, అమెరికా యూనివర్సిటీలకు డాలర్లలో ఫీజు చెల్లించాలి. అమెరికాలో ఎంఎస్ చేయాలంటే 50,000 - 60,000 డాలర్ల వరకు అవుతోంది. ఏడాది వ్యవధిలో డాలర్ విలువ రూ.7 పెరగడం వల్ల, ఒక్కో విద్యార్థి కుటుంబంపై రూ.4- 5 లక్షల అదనపు భారం పడుతోంది. కొత్తగా వెళ్దామని భావిస్తున్న విద్యార్థులు, 'ఖర్చు మరీ అధికమవుతుంద'నే ఆందోళనతో తమ అడ్మిషన్లను వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. 'స్ప్రింగ్ (అక్టోబరు-నవంబరు) అడ్మిషన్‌కు వెళ్దామనుకున్నా.. కానీ ఇప్పుడు వాయిదా వేసుకొని వచ్చే ఫాల్ (ఫిబ్రవరి-మార్చి) సెమిస్టర్‌కు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా' అని స్థానిక విద్యార్థి ఒకరు వివరించారు.