తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఇతర దేశాల కరెన్సీ కంటే 'మన రూపాయి' మెరుగే' - రూపాయి మారకం విలవు

పాశ్చాత్య దేశాల కరెన్సీతో పోలిస్తే డాలరుతో రూపాయి విలువ బాగానే రాణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇటీవల రూపాయి మారకం విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఆర్థిక మంత్రి స్పందించారు. రిజర్వ్‌ బ్యాంక్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని ఆమె చెప్పారు.

Indian Rupee Value Nirmala Seetaraman
Indian Rupee Value Nirmala Seetaraman

By

Published : Sep 24, 2022, 9:38 PM IST

Indian Rupee Value Nirmala Seetaraman: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలరుతో రూపాయి బాగానే రాణిస్తోందని చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీల్లా తీవ్రమైన ఒడుదొడుకులు, హెచ్చుతగ్గులకు గురికాలేదంటే అది భారత రూపాయేనని పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే మనం బాగా నిలబడ్డామన్నారు.
రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా జీవిత కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వలను విక్రయించొచ్చన్న అంచనాలున్నాయి.

రూపాయి పతనానికి కారణాలు
Rupee falling reasons : ఉక్రెయిన్​లో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్న నేపథ్యంలో.. సురక్షిత పెట్టుబడుల వైపే మదుపర్లు మొగ్గుచూపుతున్నారు. డాలరుపై పెట్టుబడులే భద్రమని వారు భావిస్తున్నారు. ఫలితంగా అమెరికన్ కరెన్సీ క్రమంగా బలపడుతోంది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మున్ముందు కూడా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ పరిణామాల మధ్య మదుపర్లు లాభాలు బాగుంటాయనే ఆశతో అమెరికా మార్కెట్ల వైపు మొగ్గుచూపుతుండగా.. ఆ దేశ కరెన్సీ పుంజుకుంటోంది. రూపాయి ఒత్తిడికి గురవుతోంది.

రెండేళ్ల కనిష్ఠానికి విదేశీ మారక నిల్వలు
భారత్ దగ్గరున్న విదేశీ మారక నిల్వలు రెండేళ్ల కనిష్ఠ స్థాయికి క్షీణించాయి. ఈ ఏడాది ఆరంభంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక విదేశీ మారక నిల్వలు ఏకంగా 80 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. సాధారణంగా రూపాయి పతనాన్ని ఎదుర్కొనేందుకు రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుంటుంది. డాలర్ల విక్రయం ద్వారా రూపాయి మరింత క్షీణించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే.. విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆర్​బీఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

రూపాయి క్షీణత వల్ల లాభనష్టాలు
Rupee fall effects : రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి వాటిల్లోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే డాలర్ల కోసం ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ విలువ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై కూడా భారం పెరుగుతుంది.

తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు కరెన్సీ విలువ క్షీణత వల్ల లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.

ఇవీ చదవండి:లోన్​ తీసుకుంటున్నారా?.. అయితే ఇది మీకోసమే!

రూపాయి పతనం.. క్షీణిస్తున్న ఫారెక్స్​ నిల్వలు.. ఇలాగే అయితే కష్టమే!

ABOUT THE AUTHOR

...view details