RuPay Credit Card Benefits :నేడు క్రెడిట్ కార్డ్ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. మొదట్లో క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ల్లో మాస్టర్, వీసా కార్డుల హవా నడిచింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రూపే కార్డు మాత్రం చాలా కాలం క్రితమే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ కొన్ని నెలలుగా రూపే క్రెడిట్ కార్డులకు అమాంతం డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులూ ఈ కార్డులను జారీ చేస్తున్నాయి. ఆర్బీఐ.. యూపీఐ (UPI) చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డులను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం.
రూపేతో.. యూపీఐ పేమెంట్స్!
RuPay Credit Card On UPI FAQs : సాధారణంగా బ్యాంకు అకౌంట్ల నుంచి మాత్రమే యూపీఐ పేమెంట్స్‌చేయడానికి వీలుంటుంది. క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయడానికి వీలుండదు. అయితే రూపే క్రెడిట్ కార్డులతో మాత్రం యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌లతో ఈ రూపే క్రెడిట్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. ఆపై ఎక్కడైనా స్కాన్ చేసి నేరుగా, సులువుగా చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే రూపే క్రెడిట్ కార్డు ద్వారా వ్యక్తులకు డబ్బులు పంపించడానికి, వ్యాలెట్ లోడింగ్‌కు అవకాశం ఉండదు.
ప్రయోజనాలు!
RuPay Credit Card Benefits :రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేయడం వల్ల పేమెంట్స్ చాలా సులభతరం అవుతాయి. ముఖ్యంగా ఒక చోట క్రెడిట్ కార్డు, మరో చోట యూపీఐ యాప్ వినియోగించాల్సిన అవసరం ఉండదు. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు సులువుగా పేమెంట్స్ చేయవచ్చు. ప్రతిసారీ క్రెడిట్ కార్డును వెంట పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
రివార్డ్ పాయింట్స్ వస్తాయ్!
RuPay Credit Card Reward Points : సాధారణంగా క్రెడిట్ కార్డు పేమెంట్స్‌పై రివార్డు పాయింట్లు వస్తుంటాయి. అయితే బ్యాంక్ ఖాతా ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై మాత్రం ఎలాంటి రివార్డులు రావు. కానీ రూపే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.
ఎండీఆర్ ఛార్జీలు ఉండవ్!
RuPay Credit Card MDR Charges : సాధారణంగా కొన్ని చోట్ల క్రెడిట్ కార్డులపై ఎండీఆర్ ఛార్జీలు విధిస్తుంటారు. ఈ ఛార్జీ 2 శాతం వరకు ఉంటుంది. అయితే రూపే క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్‌పై ఈ ఎండీఆర్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే పాయింట్ ఆఫ్ సేల్ (POS) కార్డు స్వైప్ మెషిన్లు లేని చిన్న చిన్న దుకాణాల్లోనూ.. రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.