తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్ల పెంపు అనివార్యం.. రుణాలు మరింత భారం!

RBI Repo Rate Increase: ఇక నుంచి రుణాలు మరింత భారం కానున్నాయి. గత నెలలో జరిగిన మధ్యంతర సమీక్షలో.. రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్​ పేర్కొన్నారు. దీంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యమనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షపై అందరి దృష్టి ఉంది.

RBI MEET
RBI MEET

By

Published : Jun 5, 2022, 9:35 AM IST

RBI Repo Rate Increase: రెండేళ్లుగా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా రుణాలకు సంబంధించి నెలవారీ కిస్తీ (ఈఎంఐ) మొత్తం పెరుగుతోంది లేదా రుణం చెల్లించాల్సిన కాలం అధికమవుతోంది. గత నెలలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.40 శాతం చేయడంతో, అందుకనుగుణంగా బ్యాంకులు రుణరేట్లను పెంచుతున్నాయి. రెపో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని మధ్యంతర సమీక్షలో ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షపై అందరి దృష్టి ఉంది.

'ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని, రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉంది' అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత సమావేశంలో పేర్కొన్నారు. దీంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యమనేది స్పష్టమవుతోంది. ఈసారి సమీక్షలో మరో 35-40 బేసిస్‌ పాయింట్లు పెంచినా.. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపోరేటు 5.15 శాతానికి చేరేందుకు అవకాశాలున్నాయి. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని 50 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను తగ్గించడం ద్వారా, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ప్రయత్నించే వీలుంది. గత సమీక్షలో సీఆర్‌ఆర్‌ను 0.50 శాతం పెంచడంతో, దాదాపు రూ.87 వేల కోట్ల నగదు ప్రవాహం బ్యాంకుల నుంచి వ్యవస్థలోకి తగ్గింది.

ఆర్‌బీఐ అంచనాలకు మించి ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి మించే కొనసాగింది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై రూ.8, డీజిలుపై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీతో పాటు ప్లాస్టిక్‌, స్టీల్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించింది. దీనికితోడు ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుతుండటం, రుతుపవనాలు సానుకూలంగానే ఉంటాయనే నివేదికలు ఈసారి పరపతి సమీక్షలో కీలకం కానున్నాయి.

1 శాతం వరకూ.. భారత్‌ వరకూ చూస్తే.. ద్రవ్యోల్బణ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు కనిపించడం లేదు. దీంతో వచ్చే నాలుగు విధాన సమీక్షల్లో కలిపి 1 శాతం వరకూ వడ్డీ రేట్లు పెరిగేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకారం చూస్తే.. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న సమీక్షలో రెపోను ఆర్‌బీఐ 40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచే వీలుంది. ఆగస్టులో అదనంగా మరో 35 బేసిస్‌ పాయింట్ల వరకూ సవరించవచ్చు. రెపో రేటు పెరిగినప్పుడు దానికి అనుసంధానమైన రెపో ఆధారిత గృహరుణ వడ్డీ రేట్లలోనూ పెంపు కనిపిస్తుంది. కాబట్టి, ఇప్పటికే రుణం తీసుకున్న వారు, కొత్తగా తీసుకోబోయే వారికీ భారం తప్పకపోవచ్చు.

ఇవీ చదవండి:అమెజాన్​ రిటైల్​ సీఈఓ డేవ్​ క్లార్క్​ రాజీనామా

తొలి జీతం అందుకున్నారా? మరి వీటిని పాటిస్తున్నారా.. లేదా?

ABOUT THE AUTHOR

...view details