Credit Debit Card New Rules: క్రెడిట్, డెబిట్ కార్డుల మోసాలు, ఛార్జీల మోత నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. కార్డుల జారీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని 2022 జులై 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిబంధనలతో వినియోగదారులకు రక్షణతో పాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి...
- క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని వినియోగదారుడు నుంచి విజ్ఞప్తి వస్తే దానిని వారం రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది.
- క్రెడిట్ కార్డు క్లోజింగ్ విషయం వినియోగదారునికి వెంటనే ఈమెయిల్, మెసేజ్ ద్వారా సమాచారం అందించాలి.
- సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన మెయిల్ ఐడీతో పాటు, ఐవీఆర్ సేవలను ఉపయోగించాలి. వాటి వివరాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, వెబ్సైట్లలో ప్రత్యేకంగా కనిపించేలా చూడాలి.
- క్రెడిట్ కార్డు మూసివేత ప్రక్రియలో విజ్ఞప్తుల స్వీకరణకు సరళీకృత విధానాన్ని అవలంబించాలి.
- పోస్ట్ లేదా ఇతర మాధ్యమాల ద్వారానే విజ్ఞప్తి చేయాలని కఠిన నిబంధనలు విధించకూడదు.
- క్రెడిట్ కార్డు మూసివేయాలని విజ్ఞప్తి చేసిన వారం రోజుల్లోనే సమస్య పరిష్కరించాలి. లేకపోతే.. ఆలస్యం చేసిన ప్రతిరోజుకు రూ.500 చొప్పున కస్టమర్‌కు బ్యాంకు జరిమానా చెల్లించాలి.
- ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డును వినియోగించకుంటే.. కార్డు యజమానికి సమాచారం అందించిన తర్వాతే ఖాతాను మూసివేసే ప్రక్రియను ప్రారంభించాలి.
- 30 రోజుల వ్యవధిలోగా కార్డ్ యజమాని నుంచి ఎటువంటి సమాధానం రాకపోతే.. బకాయిల చెల్లింపునకు లోబడే ఖాతాను మూసివేయాలి.
- 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేత రికార్డును అప్‌డేట్ చేయాలి.
- క్రెడిట్ కార్డ్ ఖాతా మూసివేసిన తర్వాత.. ఖాతాలో ఏదైనా క్రెడిట్ కార్డు నగదు ఉంటే దానిని యజమాని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి.
- క్రెడిట్ కార్డు ఛార్జీలలో ఏవైనా మార్పులు ఉంటే వాటి అమలుకు 30 రోజుల ముందే వినియోగదారునికి తెలపాలి.
- కార్డు యాక్టివేట్ కాకముందే సిబిల్, ఎక్సిపీరియన్ లాంటి క్రెడిట్ బ్యూరోలకు ఇవ్వకూడదు.
- క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే ఈఎంఐల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి.