తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్‌ @100 బిలియన్​ డాలర్లు.. ఏకైక దేశీయ కంపెనీగా అరుదైన రికార్డ్​ - ముకేశ్​ రిలియన్స్​

Reliance Q4 Results: కార్పొరేట్​ దిగ్గజం రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మరో అరుదైన రికార్డు సాధించింది. తొలిసారి 100 బిలియన్‌ డాలర్ల వార్షికాదాయాన్ని అందుకున్న దేశీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలను సైతం సాధించింది.

reliance
reliance

By

Published : May 7, 2022, 5:29 AM IST

Updated : May 7, 2022, 7:01 AM IST

Reliance Q4 100 Billion Dollars: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన రికార్డును సాధించింది. 100 బి.డాలర్ల (దాదాపు రూ.7.7 లక్షల కోట్ల) వార్షికాదాయాన్ని అధిగమించిన ఏకైక దేశీయ కంపెనీగా అవతరించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.16,203 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.13,227 కోట్ల కంటే ఇది 22.5 శాతం అధికం. కంపెనీ ఆదాయాలు 35 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లకు చేరుకున్నాయి. చమురు రిఫైనింగ్‌ మార్జిన్లు భారీగా నమోదుకావడం; టెలికాం, డిజిటల్‌ సేవల రంగాల్లో స్థిర వృద్ధి లభించడం; రిటైల్‌ వ్యాపారం బలమైన పనితీరును కనబరచడంతో ఇది సాధ్యమైంది. అయితే 2021-22 అక్టోబరు - డిసెంబరు లాభంతో పోలిస్తే 12.6 శాతం మేర తగ్గింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి:2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.60,705 కోట్లు; ఆదాయం రూ.7.92 లక్షల కోట్లు (102 బిలియన్‌ డాలర్ల)కు చేరుకుంది. అన్ని విభాగాల్లో కలిపి 2.1 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులను సంస్థ నియమించుకుంది.

అత్యధిక ఎబిటా:వడ్డీ, పన్నులు, తరుగుదల, తనఖా ముందు ఆదాయాలు(ఎబిటా) మార్చి త్రైమాసికంలో రూ.33,968 కోట్లకు చేరుకున్నాయి. 2020-21 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 28% అధికం. ఓ2సీ వ్యాపారం ఎబిటా 25% పెరగడం ఇందుకు దోహదం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలతో పెట్రోలు, డీజిల్‌పై మార్జిన్లు పెరిగాయి. 2021-22 వినియోగ వ్యాపారాల స్థూల ఆదాయాలు రూ.3 లక్షల కోట్లకు చేరుకోవడంతో ఈ వ్యాపార ఎబిటా రూ.50,000 కోట్లను అధిగమించింది. రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయమున్న రిటైల్‌ వ్యాపార ఎబిటా రూ.12,000 కోట్లను అధిగమించింది. డిజిటల్‌ సేవలు సైతం రూ.1 లక్ష కోట్ల ఆదాయంపై రూ.40,000 కోట్ల ఎబిటా నమోదు చేశాయి.

జిగేల్‌..జియో:మార్చి త్రైమాసికంలో జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం 23% వృద్ధి చెంది రూ.4,313 కోట్లకు చేరుకుంది. స్థూల ఆదాయం 21% పెరిగి రూ.26,139 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో వినియోగదార్లు తగ్గినా.. వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) 21.3% వృద్ధితో రూ.167.6కు చేరడం కలిసొచ్చింది. పూర్తి ఏడాదికి రూ.95,804 కోట్ల ఆదాయంపై రూ.15,487 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

రిటైల్‌ రాణింపు:పలు కొనుగోళ్లు చేపట్టడం; ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌ వరకు పెట్టుబడులు పెట్టడం, కరోనా అనంతరం రికవరీ రావడంతో రిటైల్‌ వ్యాపారం రాణించింది. త్రైమాసిక నికర లాభం 4.8% పెరిగి రూ.2139 కోట్లకు చేరుకుంది. కొత్తగా 793 స్టోర్లు తెరవడంతో మొత్తం స్టోర్లు 15,196కు చేరుకున్నాయి.

కరోనా సవాళ్లు కొనసాగుతున్నా.. అంతర్జాతీయ అనిశ్చితులు కనిపిస్తున్నా.. 2021-22లో రిలయన్స్‌ బలమైన పనితీరును ప్రదర్శించింది. వినియోగదార్లు మా సేవలపై సంతృప్తి కనబరచాలన్న దానిపైనే దృష్టి సారించడం వల్ల అన్ని వినియోగదారు వ్యాపారాల్లో ఆదాయాలు, లాభాలు అధికంగా నమోదయ్యాయి. రిటైల్‌ వ్యాపారంలో 15,000 స్టోర్ల మార్కును అధిగమించాం. ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే జియోఫైబర్‌ అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కంపెనీగా మారింది. దేశీయ గ్యాస్‌ రంగంలో మా సహజవాయువు విభాగం వాటా 20 శాతానికి చేరింది. పర్యావరణ హిత గిగా ఫ్యాక్టరీల ఏర్పాటు ద్వారా 2035 కల్లా సున్నా కర్బన స్థాయికి చేరుకుంటాం.

- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ

ఇదీ చదవండి:స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడి.. ఇవి అదుపులో ఉంచుకుంటేనే!

Last Updated : May 7, 2022, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details