Reliance Q2 Results : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల్లో నిరాశ పరిచింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆ కంపెనీ నికర లాభం ఫ్లాట్‌గా నమోదైంది. గతేడాది కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.13,680 కోట్లు కాగా.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.13,656 కోట్లుగా నమోదైంది. అంటే లాభం 0.2 శాతం క్షీణించింది. గత త్రైమాసికంతో పోలిస్తే లాభంలో 24 శాతం క్షీణత నమోదైంది.
అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.2.33 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించిన విండ్‌ఫాల్ లాభాల పన్ను ప్రధానంగా రిలయన్స్ చమురు ఆదాయానికి గండి కొట్టింది. అయితే, టెలికాం రిటైల్, టెలికాం వ్యాపారాలు రాణించడం కలిసొచ్చింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు విలువ బీఎస్‌ఈలో ఒక శాతం నష్టంతో రూ.2,471 వద్ద ముగిసింది.