Reliance Q1 Results 2023 : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. తమ సంస్థలోని కీలక విభాగాల బాధ్యతలను తన ముగ్గురు సంతానానికి గతేడాది అప్పజెప్పారు. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి రిలయన్స్ జియో బాధ్యతలు.. కుమార్తె ఈశాకు రిలయన్స్ రిటైల్ బాధ్యతలు అప్పగించారు. అలాగే చిన్న కుమారుడు అనంత్‌కు.. న్యూ ఎనర్జీ విభాగాలను అప్పజెప్పారు. గురువారం రిలయన్స్.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మరి ఆకాశ్, అనంత్, ఈషా.. ఈ ముగ్గురిలో అదరిగొట్టిన వ్యాపారవేత్తలు ఎవరో ఓ సారి తెలుసుకుందాం.
Jio Q1 Results 2023 : రిలయన్స్‌లోని టెలికాం విభాగం త్రైమాసిక ఫలితాల్లో సత్తా చాటింది. ఆకాశ్ అంబానీ నేతృత్వంలోని జియో.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 12 శాతం వృద్ధితో రూ.4,863 కోట్ల నికర లాభం నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 9.9 శాతం మేర పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. అయితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం జియో లాభాలు.. ఊహించిన దాని కంటే తక్కువగా వచ్చాయి. ఖర్చులు, సుంకాల వ్యయాల పెరుగుదల కారణంగా లాభం తగ్గింది. సంస్థ వ్యయం రూ.17,594 కోట్లకు పెరిగింది.