తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2022, 6:39 PM IST

ETV Bharat / business

రిలయన్స్‌- ఫ్యూచర్‌ గ్రూప్‌ విలీన ఒప్పందం రద్దు

Reliance Future retail deal: ఫ్యూచర్​ గ్రూప్​తో కుదిరిన విలీన ఒప్పందంపై సంచలన ప్రకటన చేసింది రిలయన్స్​ ఇండస్ట్రీస్​. అమెజాన్​ అభ్యంతరం తెలపటం వల్ల సుదీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్న తరుణంలో విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఫ్యూచర్​గ్రూప్​ రుణదాతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

RELIANCE FUTURE RETAIL
రిలయన్స్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ విలీన ఒప్పందం రద్దు

Reliance Future retail deal: కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌తో కుదిరిన విలీన ఒప్పందాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రద్దు చేసుకుంది. రూ.24,713 కోట్లు విలువ చేసే ఈ ఒప్పందాన్ని ఫ్యూచర్‌గ్రూప్‌ రుణదాతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ 2020 ఆగస్టులో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్‌ రిటైల్‌తో పాటు ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన పలు లిస్టెడ్‌ కంపెనీలు, తమ వాటాదార్లు, రుణదాతల సమావేశాలను ఇటీవలే పూర్తి చేశాయని రిలయన్స్‌ తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌కు తమ ఆస్తులను రూ.24,713 కోట్లకు విక్రయించేందుకు వారు అనుమతించేదిలేదని ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ తమకు తెలియజేసిందని తెలిపింది. వారంతా ఓటింగ్‌ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఫ్యూచర్‌ రిటైల్, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని అమలు చేయడం కుదరదని రిలయన్స్‌ స్పష్టం చేసింది.

ఈ ఒప్పందంపై ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తొలి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తమ కంపెనీతో గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఉల్లంఘించిందని అమెజాన్‌ ఆరోపించింది. ఈ ఒప్పందం చెల్లుబాటు కాదంటూ సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఫ్యూచర్‌ గ్రూప్‌, అమెజాన్‌ భారత్‌లో పలు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాయి. ఓ దశలో అమెజాన్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య కుదిరిన డీల్‌ను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా రద్దు చేసింది. ఇలా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం ఎక్కడా పరిష్కారం కాకపోవడం వల్ల సుప్రీంకోర్టు సూచన మేరకు తిరిగి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లోనే తేల్చుకునేందుకు ఇటీవలే ఇరు వర్గాలు అంగీకరించాయి. ఇంతలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రిలయన్స్‌ ప్రకటించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details