- "రూ.35-40 మధ్య ఉండే సబ్బు ధర రూ.25కే అందిస్తాం.."
- "రూ.325 ఉండే లిక్విడ్ డిటర్జెంట్‌ను.. కేవలం రూ.250కే ఇచ్చేస్తాం.."
- "ఐదు రూపాయలకే డిష్ వాష్ బార్ ఇస్తాం. రూపాయికే డిష్ వాష్ జెల్ కూడా ఇస్తాం.."
ఇదంతా ఏంటని ఆలోచిస్తున్నారా..? రిలయన్స్ సంస్థ అందిస్తున్న అదిరిపోయే ఆఫర్లు ఇవి. టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసి, సాఫ్ట్‌డ్రింక్ సెగ్మెంట్లో అనూహ్య పోటీకి తెరతీసిన రిలయన్స్.. ఎఫ్ఎంసీజీ రంగంలోనూ తనదైన మార్కెటింగ్ వ్యూహాలతో దూసుకెళ్లేందుకు వేసిన ప్లానే ఇది. ఇందులో భాగంగానే అతి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందిస్తోంది రిలయన్స్. సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే 30- 35 శాతం తక్కువ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)కి చెందిన ఆర్సీపీఎల్ సంస్థ ఈ మేరకు ఎఫ్ఎంసీజీ రంగంలో కొత్త యుద్ధానికి తెరతీసింది.
ఆర్సీపీఎల్ చెప్పిన ప్రకారం వివిధ ఉత్పత్తుల రేట్లు ఇలా
- గ్లిమ్మర్ బ్యూటీ సోప్, రియల్ నేచురల్ సోప్, ప్యూరిక్ హైజీన్ సోప్‌లను రూ.25కే అందించనుంది.
- సబ్బుల్లో లీడింగ్ బ్రాండ్‌గా ఉన్న లక్స్ ధర (100 గ్రాములకు) రూ.35గా ఉంది.
- డెటాల్(రూ.40- 75గ్రా), సంతూర్ (100 గ్రాములకు రూ.34) సబ్బులతో పోల్చినా రిలయన్స్ అందించే సబ్బుల ధర చాలా తక్కువ.
- కేజీ ఎంజో డిటర్జెంట్ పౌడర్‌ను రూ.149కే విక్రయిస్తోంది. రూ.250కే ఎంజో 2 లీటర్ల లిక్విడ్ డిటర్జెంట్‌ను అందించనుంది. సర్ఫ్ఎక్సెల్ మాటిక్ ధర(రూ.325)తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
- డిష్ వాషింగ్ సెగ్మెంట్లోనూ రిలయన్స్ అతి తక్కువగా ఛార్జ్ చేస్తోంది. రూ.5, 10, 15కే డిటర్జెంట్ సబ్బులను అందిస్తోంది. రూ.10, 30, 45కే లిక్విడ్ ప్యాకెట్లను విక్రయిస్తోంది. విమ్, ఎక్సో, ప్రిల్ వంటి బ్రాండ్లకు పోటీగా.. ఒక్క రూపాయికే డిటర్జెంట్ లిక్విడ్ శాషేలను మార్కెట్లోకి తెచ్చింది.
ప్రస్తుతానికైతే ఈ ఉత్పత్తులు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకొని, పాన్-ఇండియా స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కచ్చితంగా ట్రై చేస్తారు!
ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయిస్తుండటం వల్ల వినియోగదారుల్లో వాటిపై ఆసక్తి పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారైనా వాటిని ప్రయత్నించి ఓ అంచనాకు వస్తారని అంటున్నారు. నాణ్యత, వాటి స్వభావాన్ని తెలుసుకొని.. నచ్చితే తిరిగి ఉపయోగిస్తారని చెబుతున్నారు.