తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్ బ్లూటిక్ పునరుద్ధరణ మరింత ఆలస్యం.. సంస్థలకు ప్రత్యేక కలర్ బ్యాడ్జ్ - ట్విట్టర్ వెరిఫికేషన్

ట్విట్టర్ బ్లూటిక్ చెల్లింపు సేవలు మరింత ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. నకిలీ ఖాతాలను అరికట్టడంపై పూర్తి విశ్వాసం వచ్చిన తర్వాతే సేవల్ని పునరుద్ధరించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 22, 2022, 12:57 PM IST

ట్విట్టర్‌ బ్లూ టిక్‌ చెల్లింపు సేవల పునరుద్ధరణ మరింత ఆలస్యం కానున్నట్లు సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. నకిలీ ఖాతాలను అరికట్టడంపై పూర్తి విశ్వాసం ఏర్పడిన తర్వాతే ఈ సేవల్ని తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత ఖాతాదారులకు, సంస్థల ఖాతాలకు తేడా ఉండేలా కంపెనీలకు ఇచ్చే వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ రంగును మార్చే అవకాశం ఉందని వెల్లడించారు.

8 డాలర్లు తీసుకుని నవంబరు 29 నుంచి ట్విట్టర్‌ బ్లూ సేవలను పునఃప్రారంభించనున్నట్లు మస్క్‌ ఇటీవల పేర్కొన్నారు. ఖాతాదార్ల వివరాల తనిఖీ అనంతరమే బ్లూటిక్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. పలువురు ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు వెల్లువెత్తడం వల్ల కొద్ది రోజులుగా ఈ సేవలను ట్విట్టర్‌ నిలిపివేసింది.

అక్టోబరు 27న మస్క్‌ చేతికి ట్విట్టర్‌ రాకముందు ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీ తారలు, ఇతర సెలబ్రిటీల ఖాతా వివరాలను తనిఖీ చేశాకే బ్లూటిక్‌ ఇచ్చేవారు. నవంబరు 6న బ్లూటిక్‌ సేవలకు నెలకు 8 డాలర్ల ఫీజు ప్రకటించి ఎటువంటి తనిఖీలు చేపట్టకుండా ఇచ్చేశారు. దీంతో 8 డాలర్లు చెల్లించిన కొందరు వ్యక్తులు ప్రముఖులు, కంపెనీల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారు. ఫలితంగా పలు సంస్థలు భారీగా నష్టపోయాయి. ఈ మేరకు ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల ఈ సేవలను నిలిపివేశారు.

నమస్తే..
ట్విట్టర్‌లో చేస్తున్న మార్పులు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. వాటిలో కొన్నింటికి ఓపికగా సమాధానం చెప్పారు మస్క్. మరికొన్నింటిని తిప్పికొట్టారు. అయినా, విమర్శలు ఆగకపోవడం వల్ల ఆయన విసుగెత్తిపోయారు. 'మీరు ట్విట్టర్‌ నుంచి వైదొలిగినా సరే.. మీకో దండం' అంటూ విమర్శకులకు ఓ 'నమస్తే' చెప్పి ముగించారు. సాధారణంగా భారత్‌లో ఏదైనా విషయంలో చిర్రెత్తికొచ్చినప్పుడు 'మీకో దండం' అని రెండు చేతులు జోడించి 'ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి' అని అంటుంటారు! తాజాగా మస్క్‌ కూడా అదే పనిచేశారు. అయితే, ఇంగ్లిషులో కాకుండా భారతీయ భాషలో నమస్తే చెప్పడం విశేషం.

మస్క్ నమస్తే ట్వీట్

ABOUT THE AUTHOR

...view details