Recurring Deposit SBI vs Post Office : పెట్టుబడులపై మంచి వడ్డీలు పొందేందుకు రికరింగ్ డిపాజిట్లు అనేవి ఓ అనువైన మార్గంగా చెప్పవచ్చు. ప్రతినెలా తక్కువ మొత్తంలో డబ్బును జమ చేస్తూ.. ఎక్కువ సొమ్మును కూడగట్టుకునేందుకు ఈ డిపాజిట్లు దోహదపడతాయి. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బ్యాంకులన్నీ రికరింగ్ డిపాజిట్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎస్బీఐ, పోస్టాఫీస్.. రికరింగ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Recurring Deposit Features : రికరింగ్ డిపాజిట్ల ఫీచర్లు..
- ప్రజల్లో పొదుపును ప్రోత్సహించేందుకు ఈ రికరింగ్ డిపాట్లను ప్రవేశపెట్టారు.
- కేవలం చిన్న మొత్తాలతో ఆరు నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఈ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు.
- తనకు అనుకూలమైన కాల వ్యవధిని ఖాతాదారు ఎంచుకోవచ్చు.
- రికరింగ్ డిపాజిట్ అకౌంట్.. సుమారు 30 రోజుల నుంచి మూడు నెలల వరకు లాక్-ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటుంది. ఇది సంబంధిత బ్యాంకును బట్టి ఉంటుంది.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లు..
SBI Rd Interest Rate 2023 : ఏడాది నుంచి పది సంవత్సరాల కాల వ్యవధి వరకు రికరింగ్ డిపాజిట్లను స్వీకరిస్తుంది ఎస్బీఐ. ప్రతినెల కనీసం వంద రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. తరువాత ఆ మొత్తానికి పది రూపాయలను జోడిస్తూ చెల్లించాలి. రికరింగ్ డిపాజిట్లపై సగటున సాధారణ ప్రజలకు 6.5 నుంచి 7 శాతం వడ్డీని చెల్లిస్తుంది ఎస్బీఐ. సీనియర్ సిటీజన్లకు మాత్రం.. 7 నుంచి 7.5శాతం వరకు వడ్డీని అందిస్తుంది. 2023 ఫిబ్రవరి 15 నుంచి ఈ వడ్డీ రేట్లు అందుబాటులోకి వచ్చాయి.