Recurring Deposit Interest Rates 2023 :ప్రస్తుత రోజుల్లో ఎంత సంపాందించినా.. చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు. రోజురోజుకీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతోపాటు పలు రకాల కారణాలతో జనం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి.. ఎవరైనా సరే, సంపాదన ప్రారంభించిన వెంటనే పొదుపు చేసుకోవడం మొదలు పెట్టాలి. దీని కోసం ఇప్పుడు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి రికరింగ్ డిపాజిట్. నిర్దిష్ట కాలానికి నెలవారీగా కొంత మొత్తం మనీ కట్టుకుంటూ పోతే.. మంచి వడ్డీ రేటుతో అదిరిపోయే రిటర్న్స్ ఇందులో లభిస్తోంది. ఎవరైనా ఈ డిపాజిట్ స్కీమ్ కింద నిర్దిష్ట కాలానికి ప్రతి నెలా/త్రైమాసికం/అర్ధ సంవత్సరం నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. పైగా రిస్క్ కూడా తక్కువ.
Post Office Vs Banks RD Interest Rates :అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, స్వల్ప కాలానికి చిన్న మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వారికి ఆర్‌డీలు మంచి ఎంపిక. అదే పిల్లల చదువుకు నిధులు సమకూర్చడం, పెళ్లికి ప్లాన్ చేయడం లేదా అత్యవసర నిధి ఏర్పాటు వంటి వివిధ లక్ష్యాలను సాధించడానికి దీర్ఘకాలిక ఆర్‌డీలు(RD) అనువైనవి. అయితే చాలా మంది రికరింగ్ డిపాజిట్ అంటే బ్యాంకులకు వెళ్తుంటారు. ఎల్లవేళలా అది మంచి ఆప్షన్ కాదని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. జనాల్లో విశేష ఆదరణ పొందిన పోస్టాఫీస్లోను రికరింగ్ డిపాజిట్(RD) ఉంది. ఇందులో అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర పెంచగా ఇది 6.50 శాతం నుంచి 6.70 శాతానికి పెరిగింది.
Recurring Deposit Scheme :ఇక బ్యాంకుల విషయానికొస్తే.. వీటిల్లో రికరింగ్ డిపాజిట్ అనేది 6 నెలల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌తో ఉంది. అంటే మీరు ఎంత కాలానికైనా అందులో డిపాజిట్లు చేయొచ్చు. ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అంటే నెలనెలా డిపాజిట్ చేయాల్సి ఉంటుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇక అదే పోస్టాఫీస్ స్కీమ్స్(Post Office scheme)లో మాత్రం ఐదేళ్ల టెన్యూర్ ఒక్కటే ఉంది. అంటే నెలనెలా 5 సంవత్సరాలు కట్టాలి అన్నమాట. అయితే.. ఇప్పుడు చాలా మందికి ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందనే అనే సందేహం వస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ని.. ఐదేళ్ల బ్యాంక్ ఆర్డీల వడ్డీ రేట్లనుతో పోలిస్తే ఏది బెటర్ అనేది తెలుస్తుంది. మరి, దేంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
SBI RD Vs Post Office RD.. రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్?
Post Office Scheme :ప్రస్తుతం పోస్టాఫీస్‌లో ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్(RD)పై వడ్డీ రేట్లు 6.70 శాతంగా ఉండగా.. అదే దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 5 సంవత్సరాల ఆర్‌డీపై 6.50 శాతం వడ్డీ వస్తుండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మాత్రం 5.30 శాతంగా ఉంది. అలాగే ఐదేళ్ల ఆర్డీలపై యస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకుల్లో 6.50 శాతం వడ్డీ ఉండగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బంధన్ బ్యాంకుల్లో 5.60 శాతంగా ఉంది.