Reactions Against Infosys Narayana Murthy : నేటి యువత వారానికి కనీసం 70 గంటలపాటు పని చేయాలని.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన సూచనపై అంతర్జాలంలో పలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Narayana Murthy About Indian Work Culture :ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్‌తో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. మిగతా దేశాలతో పోల్చితే, భారతదేశంలో ఉత్పాదకత బాగా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీలు అమలు చేసిన వ్యూహాలనే నేడు భారతదేశంలో అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత వారంలో కనీసం 70 గంటలపాటు పనిచేయాలని ఆయన సూచించారు. అప్పుడే ఎంతో అభివృద్ధి చెందిన చైనా లాంటి దేశాలతో మనం పోటీపడగలుగుతాము అని ఆయన పేర్కొన్నారు. పరిపాలనలో అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే జాప్యం వల్ల.. భారతదేశంలో పని ఉత్పాదకత చాలా తక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ఐటీ సంస్థల దోపిడీ విధానం గురించి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.
"రోజుకు 70 గంటలు పనిచేయాలా? యువతీయువకులను పనిలో పెట్టుకుని, వారితో గొడ్డుల్లా పనిచేయించి.. భారీ లాభాలను ఆర్జించడం సరైనది కాదు. ఇది పూర్తిగా దోపిడీ విధానం.ఇదొక బ్యాడ్ బిజినెస్ మోడల్."
- నరేష్
"నారాయణ మూర్తి చెప్పింది చాలా మంచి విషయం. కానీ ఇన్ఫోసిస్‌లో ఒక ఫ్రెషర్‌కు సంవత్సరానికి 3.5 లక్షలు మాత్రమే జీతంగా ఇస్తున్న ఆయన.. చాలా ఎక్కువగా ఆశిస్తున్నారు. ముందుగా తమ ఉద్యోగులకు జీతాలు పెంచి, తరువాత ఇలాంటి సలహాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఆయన తన జీవితంలో ఇలాంటి ఆలోచన చేసి ఉండరు."
- ప్రయూష్ జైన్