RBL Bank Launches GO Savings Account :ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అన్నది ప్రతి ఒక్కరికీ అవసరంగా మారిపోయింది. కానీ.. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీస బ్యాలెన్స్ ఉండాలి. దేశంలోని ఏ ప్రధాన బ్యాంకులో ఖాతా తీయాలన్నా కనీసం రూ. 1000 ఉండాలి. అయితే.. అవసరాలకు సరిపోయే మొత్తాన్ని సంపాదించుకునే వారికి కనీస బ్యాలెన్స్ నిర్వహణ భారం అవుతుంది. ఇటీవలి కాలంలో చాలా బ్యాంకులు.. సేవింగ్స్ అకౌంట్లలో(Savings Account) మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయని వారికి ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొత్తగా అకౌంట్ తీసుకోవాలనుకుంటున్న వారికి ఆర్‌బీఎల్ బ్యాంక్(RBL Bank) ప్రకటన గుడ్‌న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంతకీ, ఆ బ్యాంక్ ఏం ప్రకటన చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
RBL Bank Launches Zero Balance Savings Account :ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఆర్‌బీఎల్(RBL Bank) కీలక నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్ GO సేవింగ్ అకౌంట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది సులభంగా నిర్వహించగల జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావడం విశేషం. ఈ అకౌంట్ అన్ని వయసుల వినియోగదారులకూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఖాతా ఓపెనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుందని.. ఫీచర్లను కూడా ఈజీగా ఆస్వాదించొచ్చని ఆర్‌బీఎల్ బ్యాంక్ స్పష్టం చేసింది. కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాల్లో కనీస మొత్తంలో డబ్బులు లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తున్న వేళ ఈ బ్యాంక్ జీరో అకౌంట్ ప్రారంభించడం విశేషం.
ఆర్‌బీఎల్ జీరో సేవింగ్స్ అకౌంట్ ఫీచర్లివే..ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎన్నో బహుళ కస్టమర్ స్నేహ పూర్వక ప్రయోజనాల్ని ఆఫర్ చేస్తోంది. గో సేవింగ్స్ అకౌంట్లపై వార్షిక ప్రాతిపదికన 7.5% వరకు వడ్డీ అందిస్తుంది. ప్రీమియం డెబిట్ కార్డు కూడా ఇస్తుంది. అలాగే ప్రీమియం బాండ్లపై రూ. 1,500 విలువైన వోచర్లూ ఇస్తుండటం గమనార్హం. అలాగే ఆర్‌బీఎల్ GO సేవింగ్స్ అకౌంట్ సమగ్ర సైబర్ బీమా కవరేజీ అందిస్తుంది. దీని కింద రూ.1 కోటి వరకు ప్రమాద, ప్రయాణ బీమా లభిస్తుంది. అదేవిధంగా ఉచితంగా CIBIL నివేదిక కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఈ అకౌంట్‌తో ఎన్నో ప్రీమియం బ్యాంకింగ్ సేవల్ని ఆస్వాదించొచ్చు.