RBI Dividend: మార్చి 2022తో ముగిసిన త్రైమాసికకుగానూ కేంద్ర ప్రభుత్వానికి రూ.30,307 కోట్లు డివిడెండ్‌గా చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం కూడా లభించినట్లు తెలిపింది. కంటింజెన్సీ రిస్క్ బఫర్ కింద 5.50 శాతం నిధుల్ని తమ వద్దే ఉంచనున్నట్లు పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
గత ఏడాది మే నెలలో.. జులై 2020-మార్చి 2021 మధ్యకాలానిగానూ రూ.99,122 కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్‌గా ఆర్‌బీఐ చెల్లించింది. ఆర్‌బీఐ తన ఆర్థిక సంవత్సరాన్ని ప్రభుత్వ ఆర్థిక ఏడాదికి అనుసంధానించిన నేపథ్యంలో గత ఏడాది కేవలం తొమ్మిది నెలల కాలానికే డివిడెండు చెల్లించింది. అప్పటి వరకు ఆర్‌బీఐ జులై-జూన్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. ఈరోజు జరిగిన సమావేశంలో దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయాలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ పనితీరును కూడా సమీక్షించినట్లు వెల్లడించారు.