తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్ల పెంపుతో సామాన్యులకు షాక్​.. ఈఎంఐలు మరింత భారం - ఆర్​బీఐ

RBI Repo Rate: ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినట్లే, రాష్ట్రాలు కూడా డీజిల్‌, పెట్రోలుపై వ్యాట్‌ తగ్గిస్తే, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు.

shaktikanthdas
శక్తికాంత్​దాస్

By

Published : Jun 9, 2022, 7:06 AM IST

RBI Repo Rate: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 4.4 నుంచి 4.9 శాతానికి పెరిగింది. పెంచిన వడ్డీరేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని శక్తికాంత దాస్ చెప్పారు.

"ద్రవ్యోల్బణం- వృద్ధి చుట్టూనే మా భవిష్యత్‌ కార్యాచరణ ఉండబోతోంది. ఆ నిర్ణయాలు ఎలా ఉండొచ్చనే విషయంపై మార్కెట్‌కు స్పష్టత ఇచ్చేందుకే సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి పెట్టనున్నాం. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపునకు సరఫరాపరంగా మరిన్ని చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినట్లే, రాష్ట్రాలు కూడా డీజిల్‌, పెట్రోలుపై వ్యాట్‌ తగ్గిస్తే, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుంది. ఉత్పాదకత అవసరాలకు, బ్యాంకులు రుణాలిచ్చేందుకు వ్యవస్థలో తగినంత నిధుల లభ్యత ఉంది. కరెంటు ఖాతా లోటు సరైన స్థాయిల వద్దే కొనసాగుతుందని భావిస్తున్నాం. క్రిప్టో కరెన్సీలపై చర్చాపత్రం కోసం ఎదురుచూస్తున్నాం"

- శక్తికాంత దాస్‌, గవర్నరు, ఆర్‌బీఐ

ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే (రెపో రేటు) వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.9 శాతానికి చేర్చినట్లు బుధవారం ప్రకటించింది. మే 4న రెపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.40 శాతం చేయగానే, బ్యాంకులు తమ వినియోగదారులకు ఆ భారాన్ని ఇప్పటికే బదలాయించాయి. తాజా మార్పునకు అనుగుణంగా బ్యాంకులు మళ్లీ వడ్డీ రేట్లు పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదా (ఈఎమ్‌ఐ)లు మరింత భారం కానున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు.. వృద్ధికి సహకారం అందించేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్‌బీఐ తెలిపింది. అంటే రెపోరేటు మరింత పెంచుతామనే సంకేతాలు ఇచ్చారు. ఈనెల 6న ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..

ఐదు వారాల్లో రెండో సారి..:కొవిడ్‌ ముందే వృద్ధిరేటు మందగించడంతో, రెపోరేటును 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ తగ్గిస్తూ వచ్చింది. కొవిడ్‌ తొలిరోజుల్లో 2020లో మార్చి, మే నెలల్లో 75 బేసిస్‌ పాయింట్లు; 40 బేసిస్‌ పాయింట్ల చొప్పున కోత వేసింది. 2019 నుంచి 2020 మేలోపు రెపోరేటులో 250 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించి, రికార్డు కనిష్ఠమైన 4 శాతానికి చేర్చింది. ఆ తర్వాత 11 సార్లు ద్వైమాసిక సమీక్ష జరిగినా, రేట్లు సవరించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మేలో 40 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.40 శాతం చేసింది. ఇప్పుడు మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.90 శాతం చేసింది. అంటే ఐదు వారాల వ్యవధిలోనే రెపో రేటు 90 బేసిస్‌ పాయింట్లు పెరిగింది. ఇప్పటికీ ఇది కొవిడ్‌-19 ముందు స్థాయి కంటే తక్కువగానే ఉందని దాస్‌ చెప్పారు. రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచేందుకు పరపతి విధాన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. రెపో రేటుకు తగ్గట్లుగా స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేట్లను కూడా 50 బేసిస్‌ పాయింట్లు పెంచి వరుసగా 4.65 శాతం, 5.15 శాతానికి ఆర్‌బీఐ చేర్చింది.

ద్రవ్యోల్బణ అంచనా 6.7%..: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరిగిందని, మనపైనా ప్రభావం పడుతోందని శక్తికాంత దాస్‌ తెలిపారు. సరఫరా అవరోధాలు మరింత తీవ్రమైతే, ప్రపంచవ్యాప్తంగా ఆహారం, కమొడిటీలు, ఇంధన ధరలు పెరగొచ్చని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాలను 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్దేశించుకున్న నియంత్రణ లక్ష్యానికి (2-6%) ఎగువనే ఇది ఉంటుందని భావిస్తున్నామన్నారు. కొవిడ్‌ సమయంలో ప్రకటించిన సర్దుబాటు విధాన వైఖరి పదాన్ని ఉపసంహరిసుస్తున్నా, వృద్ధికి సహకరించేలా విధానం ఉంటుందని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రేట్ల పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చారు వ్యవస్థలో ద్రవ్యలభ్యత కొవిడ్‌ ముందుకంటే అధికంగా ఉందని దాస్‌ తెలిపారు. పెట్రోలు, డీజిల్‌పై సుంకాల తగ్గింపు సహా, కొన్నిరకాల వంటనూనెల ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలను రద్దు చేసినందున ద్రవ్యోల్బణం కొంత మేర దిగివచ్చే అవకాశాలూ లేకపోలేదని దాస్‌ అభిప్రాయపడ్డారు. సాధారణ వర్షపాతం అంచనాలు, పామాయిల్‌ ఎగుమతులపై ఆంక్షలను ఇండోనేసియా ఎత్తివేయడం, అంతర్జాతీయంగా పారిశ్రామిక లోహ ధరలు దిగివస్తున్న సంకేతాలు ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇళ్లకు గిరాకీ నెమ్మదిస్తుంది..:రెపోరేటును పెంచడం వల్ల గృహ రుణాలు భారమౌతాయని, ఫలితంగా స్వల్పకాలంలో ఇళ్లకు గిరాకీ నెమ్మదిస్తుందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థలు పేర్కొన్నాయి.

వడ్డీరేట్లు పెరిగినా, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయం కంటే తక్కువే ఉంటాయి. అయినా కూడా రాబోయే నెలల్లో నివాస గృహాలకు గిరాకీ తగ్గుతుంది. అందుబాటు ధర, మధ్యశ్రేణి నివాసాలపై అధిక ప్రభావం ఉంటుంది. సొంత ఇల్లు సమకూర్చుకుందామని గట్టిగా భావించే వారే ముందుకొస్తారు.

- అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి, సీబీఆర్‌ఈ ఇండియా ఛైర్మన్‌ అన్షుమన్‌ మ్యాగజైన్‌

నిర్మాణ వ్యయాలు బాగా పెరుగుతున్నాయి. రుణరేట్ల పెంపు వల్ల నెలవారీ కిస్తీల భారం పెరిగి, స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిర్మాణదారులు కూడా కొత్త ప్రాజెక్టులపై నెమ్మదిస్తారు.

- నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌

ఇళ్లకు గిరాకీపై స్వల్పకాలంలో ప్రభావం ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే, ఉక్కు, సిమెంటు వంటి ముడి పదార్థాల ధరలు తగ్గుతాయి. సహకార బ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రెట్టింపు చేయడం వల్ల చిన్న పట్టణాల్లో నిర్మాణాలకు మద్దతు లభిస్తుంది.

-క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు హర్ష్‌ వర్థన్‌ పటోడియా, నారెడ్కో ప్రెసిడెంట్‌ రాన్‌ బందేల్కర్‌, టాటా రియాల్టీ ఎండీ సంజయ్‌ దత్‌

ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో, రెపోరేటు నిర్ణయం తప్పనిసరి అయ్యింది. సర్దుబాటు విధాన వైఖరిని ఉపసంహరించడం కూడా ఇందుకే. ఇదే సమయంలో వృద్ధికి ఆటంకం కలగకుండా చూస్తోంది. కొవిడ్‌ ముందుకంటే, రెపోరేటును దిగువనే ఉంచడం ఇందుకు నిదర్శనం

- సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌

జీడీపీ వృద్ధి అంచనాల్లో మార్పుల్లేవ్‌..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయకుండా 7.2 శాతంగానే కొనసాగించారు. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ వృద్ధి నెమ్మదించడం మన ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపించొచ్చని ఆర్‌బీఐ హెచ్చరించింది. దేశీయ ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి బలంగా ఉందనే విషయాన్ని ఏప్రిల్‌, మే నెల గణాంకాలు వెల్లడిస్తున్నాయని దాస్‌ చెప్పారు. తయారీ, సేవా రంగ పీఎంఐ సూచీలు మరింత వృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. రైలు రవాణా, ఓడ రవాణా, విమాన ప్రయాణికుల రద్దీ, జీఎస్‌టీ వసూళ్లు, ఉక్కు వినియోగం, సిమెంటు ఉత్పత్తి, బ్యాంకుల రుణాల్లో వృద్ధి లాంటివి ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు.

ఆ చెల్లింపుల పరిమితి రూ.15000కు..: బీమా ప్రీమియం, బిల్లుల చెల్లింపు, నెలవారీ చెల్లించాల్సిన చందా రుసుముల వంటి వాటికి ఆటో డెబిట్‌ సదుపాయాన్ని చాలామంది వినియోగించుకుంటున్నారు. రూ.5,000 మించిన ఇలాంటి లావాదేవీకి వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ను వినియోగదారులు నమోదు చేయాల్సి వస్తోంది. ఇప్పుడీ పరిమితిని రూ.15,000కు పెంచారు. ఇంతకుమించితేనే ఓటీపీ నమోదు చేయాల్సి వస్తుంది.

రేట్ల పెంపు మొదలు..: రెపోరేటుకు అనుసంధానమై ఉండే రుణ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.75 శాతం చేసినట్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. కొత్తరేటు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించగానే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రేట్లు మార్చడం గమనార్హం. నిధుల వ్యయం ఆధారిత రుణరేట్లను ఒకరోజు నుంచి ఏడాది కాలావధికి 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ఈ నెలారంభంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌ రుణరేట్లు 6.70-7.70 శాతంగా ఉన్నాయి.

మార్చి కల్లా కొవిడ్‌ ముందుస్థాయికి కీలకరేట్లు..:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించే తదుపరి ఎంపీసీ సమీక్షల్లో రెపోరేటును ఆర్‌బీఐ పెంచే అవకాశం ఉందని, మార్చి కల్లా కొవిడ్‌ ముందుస్థాయికి చేర్చొచ్చని అంచాను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 2 సమీక్షల్లో 35, 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చని ఇక్రా అభిప్రాయ పడింది. డిసెంబరు లోపు జరిగే 3 సమీక్షల్లో 35, 25, 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున పెంచి రెపోరేటును 5.75 శాతానికి చేరుస్తారనే అంచనాను బార్‌క్లేస్‌ వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 75 బేసిస్‌ పాయింట్లు పెంచొచ్చని క్రిసిల్‌ పేర్కొంది.

రూ.1.40 కోట్ల వరకు గృహ రుణం..:వ్యక్తులకు పట్టణ సహకార బ్యాంకులు గరిష్ఠంగా ఇచ్చే గృహ రుణ పరిమితిని రూ.1.40 కోట్లకు ఆర్‌బీఐ పెంచింది. ఇంతకుముందు ఇది రూ.70 లక్షలుగా ఉంది. గ్రామీణ సహకార బ్యాంకులు కూడా ఒక వ్యక్తిగా గరిష్ఠంగా రూ.75 లక్షల వరకు గృహ రుణం ఇవ్వొచ్చని తెలిపింది. గతంలో ఈ పరిమితి రూ.30 లక్షలు మాత్రమే. ఇళ్ల ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని, వినియోగదారుల అవసరాల రీత్యా రుణ పరిమితిని రెట్టింపు చేసినట్లు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ చెప్పారు.

  • వాణిజ్య స్థిరాస్తి- నివాస గృహాల రంగానికి రుణాలిచ్చేందుకు గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి.
  • ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు పట్టణ సహకార బ్యాంకులకు అనుమతి.

యూపీఐ - క్రెడిట్‌ కార్డు అనుసంధానం..: యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)కు క్రెడిట్‌ కార్డులను అనుసంధానం చేసేందుకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. ప్రస్తుతం బ్యాంకు పొదుపు ఖాతా, కరెంటు ఖాతాకు సంబంధించి డెబిట్‌ కార్డులను మాత్రమే యూపీఐకు అనుసంధానం చేసే వీలుంది. ఇప్పుడు క్రెడిట్‌ కార్డులను కూడా యూపీఐకు అనుసంధానించడం వల్ల, చెల్లింపులకు మరింత వీలు కల్పించినట్లు అవుతుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు టి.రవి శంకర్‌ తెలిపారు. రూపే క్రెడిట్‌ కార్డుల ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించనున్నామని శక్తికాంత దాస్‌ చెప్పారు. తగిన వ్యవస్థను రూపొందించాక ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీలకు రుసుము లేదు. అయితే క్రెడిట్‌కార్డుల సంస్థలు లావాదేవీకి అనుగుణంగా ఛార్జీ చేస్తుంటాయి. ఈ రెండిటి అనుసంధానం నేపథ్యంలో, ఛార్జీల నిర్ణయాన్ని బ్యాంకులే తీసుకోనున్నాయి.

రుణ యాప్‌లు ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయండి: నమోదుకాని డిజిటల్‌ రుణ యాప్‌ల నుంచి అప్పులు తీసుకున్న వినియోగదారులు, ఏవైనా సమస్యలు ఎదురైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు. తద్వారా నమోదైన రుణ సంస్థలపైనే ఆర్‌బీఐ చర్యలు చేపట్టగలదని స్పష్టం చేశారు. డిజిటల్‌ రుణ యాప్‌ల ఏజెంట్లు, సిబ్బంది వేధింపులతో పలువురు రుణగ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే వార్తల నేపథ్యంలో దాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ శాతం రుణ యాప్‌లు ఆర్‌బీఐ వద్ద నమోదు కాకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నాయని దాస్‌ చెప్పారు. వినియోగదారుల సమస్యలపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. తమ వద్ద నమోదైన యాప్‌ల వివరాలు, ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ యాప్‌ల నుంచి ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందితే, తాము సత్వరం చర్యలు తీసుకుంటామని దాస్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :రూ.లక్ష లోన్‌పై ఈఎంఐ ఎంత పెరిగే అవకాశం ఉందంటే..?

ABOUT THE AUTHOR

...view details