Home loan interest rate : భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అప్పు తీసుకున్న, తీసుకోబోయే వారికి ఇది కొంత ఊరట కలిగించే వార్త అయినప్పటికీ.. ఈ రేట్లు ఇలాగే ఎంత కాలం ఉంటాయనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. రుణాలు ఖరీదుగా మారితే.. అప్పు తీసుకున్నవారికి పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. కొంతమంది విషయంలో రుణ అర్హత తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల కొనబోయే ఇంటి విస్తీర్ణంపై ప్రభావం ఉండొచ్చు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో గృహ రుణం తీసుకోవాలా? ఇంకొంత సమయం వేచి చూడాలా? అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దీనికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
RBI Repo rate impact on home loan : ద్రవ్యోల్బణం కదలికలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. మార్చిలో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతానికి తగ్గింది. ఫిబ్రవరి నెలలో 6.44 శాతంతో పోలిస్తే ఇది 15 నెలల కనిష్ఠ స్థాయి. ఈ నేపథ్యంలో రాబోయే ద్రవ్య విధాన సమీక్ష అనంతరం వడ్డీ రేట్లలో మార్పులు ఉండొచ్చు. కాబట్టి.. వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలి. సాధారణంగా గృహ రుణాలు చలన వడ్డీ విధానం ఉంటాయి. రెపో రేటు మారినప్పుడల్లా గృహ రుణ వడ్డీ రేట్లు మారిపోతాయి. కాబట్టి.. వడ్డీ రేటు గురించి ఆలోచించకుండా వ్యక్తిగతంగా హోమ్ లోన్‌కు సిద్ధమవ్వాలి. ప్లాన్ ప్రకారం వెళ్తే సొంతింటి కల సాకారం అవుతుంది.
ఆర్థిక ఆరోగ్యం బాగుందా?
ఆర్థికంగా స్థిరంగా ఉన్నామా లేదా అని కొత్తగా రుణం తీసుకునే వారు తప్పక పరిశీలించుకోవాలి. గృహరుణం దీర్ఘకాలం కొనసాగుతుంది. కాబట్టి, నెలవారీ చెల్లింపుల విషయంలో ఇబ్బంది లేదన్న విషయాన్ని నిర్ధరించుకోవాలి. సాధారణంగా ఇంటి విలువలో 75-80శాతం వరకూ రుణం లభిస్తుంది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఆస్తి విలువలో కనీసం 30-40 శాతం మీరు భరించగలగాలి. మిగిలిన మొత్తం రుణం ద్వారా సమీకరించవచ్చు. మీరు ఆర్థికంగా బలంగా లేకపోయినా, మార్జిన్ మొత్తం తక్కువగా ఉన్నా రుణం తీసుకునే విషయంపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. మెరుగైన ఆర్థిక స్థితికి చేరేంత వరకూ సొంతింటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది.
స్కోరు బాగుందా?
రుణ వడ్డీ రేట్లను బ్యాంకులు.. క్రెడిట్ స్కోరుతో ముడి పెడుతున్నాయి. మంచి క్రెడిట్ స్కోరుంటే.. వడ్డీలో రాయితీ లభిస్తుంది. తక్కువ వడ్డీకి రుణం లభిస్తే దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇది మీ రుణాన్ని మరింత ఖరీదైన లోన్‌గా మారుస్తుంది. 750 పాయింట్లకు మించి స్కోరుంటే సులభంగా రుణాలు లభిస్తాయి. ఇదివరకే తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే బ్యాంకులు తక్కువ స్కోరునూ పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే రుణం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వడ్డీ రేట్ల కోసం బ్యాంకులతో చర్చించే వీలు కూడా ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోరు మంచి స్థితిలో ఉందో లేదో స్వయంగా తెలుసుకోండి.