ఒకప్పుడు మిత్రులకో లేక బంధువులకో నగదు బదిలీ చేయడం అనేది పెద్ద పని. బ్యాంకు వెళ్లాలి. క్యూలో నిలబడాలి. మన వంతు వచ్చే వరకూ ఎదురు చూడాలి. మన వరకూ లావాదేవీ పూర్తి చేసినా వెంటనే సొమ్ము బదిలీ కాదు. అందుకు కొన్ని గంటల సమయం లేదా ఒక రోజు అయినా పట్టేది. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. అనుకోవడం ఆలస్యం మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి నగదు బదిలీ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇలా బదిలీ చేయగానే.. అలా అవతలి వ్యక్తి ఖాతాకు నగదు జమ అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు రావటానికి వీలు కల్పించిన ఘనత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్)కి దక్కుతుంది. మొబైల్ యాప్/నెట్ బ్యాంకింగ్- యూపీఐతో రూ.1 నుంచి రూ.లక్షల వరకు వెంటనే బదిలీ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే.. వంటి యూపీఐ ఆధారిత పేమెంట్స్ యాప్స్‌తో నగదు బదిలీ ఇంకా సులువైంది.
ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. నగదు బదిలీ చేసే సమయంలో పొరపాటున మనం అనుకునే వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి బదిలీ చేస్తే..? పెద్ద సమస్యే. ఆ సొమ్ము వెనక్కి తెచ్చుకోవడం ఎంతో కష్టం. అసలు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఆ సొమ్ము వెళ్లిన వ్యక్తి ఎవరో మనకు తెలీదు. వెతికి పట్టుకోవడం, సొమ్ము వెనక్కి తెచ్చుకోవడం అయ్యే పని కాదు. పైగా తన ఖాతాలో సొమ్ము పడగానే విత్‌డ్రా చేసి ఖర్చు చేసే వాళ్లుంటారు. అదే జరిగితే.. ఇక అంతే సంగతులు. ఇన్నాళ్లూ ఇలా పొరపాటున వేరే వాళ్లకు నగదు బదిలీ చేసిన వ్యక్తులు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లు. కానీ ఆర్‌బీఐ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల పుణ్యమాని.. ఇలా పారబాటున ఇతరులకు బదిలీ చేసిన సొమ్ము వెనక్కి తెచ్చుకునేందుకు కొంత అవకాశం కనిపిస్తోంది. అదెలాగంటే..
- పొరపాటున ఇతరులకు నగదు బదిలీ చేస్తే.. వెంటనే ఆ విషయమై నగదు బదిలీకి వినియోగించిన పేమెంట్ సిస్టమ్ (పేటీఎం, జీపే, ఫోన్‌పే వంటి యూపీఐ ప్లాట్‌ఫామ్స్)కు ఫిర్యాదు చేయాలి.
- లేదంటే బాధితుడు ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పోర్టల్‌లోనూ ఫిర్యాదు దాఖలు చేయవచ్చు.
- యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ, వర్చువల్ పేమెంట్ అడ్రసు, బదిలీ చేసిన సొమ్ము, బదిలీ చేసిన తేదీ, బాధితుడి ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్.. తదితర వివరాలను ఈ ఫిర్యాదులో పొందుపరచాలి.
- దీంతో పాటు బాధితుడు తన బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ కూడా సమర్పించాలి. నగదు బదిలీ చేసిన విషయం స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది.
- పొరపాటున ఇతరులకు నగదు బదిలీ చేశాననే విషయాన్ని ఈ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనాలి.
- తగిన సమయంలో నగదు వెనక్కి రాని పక్షంలో.. పీఎస్‌పీ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్) బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. అయినా సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ (డిజిటల్ కంప్లయింట్స్)ను సంప్రదించాలి.