తెలంగాణ

telangana

ETV Bharat / business

RBI కొత్త రూల్స్.. క్రెడిట్‌ కార్డ్ బిల్​ కట్టడం లేటైనా ఓకే.. కానీ ఓ షరతు! - క్రెడిట్ కార్డ్ ఆలస్య రుసుము మాఫీ

క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించడం కాస్త ఆలస్యమైందా? ఆలస్య రుసుము, అదనపు వడ్డీతో బాదుడుతోపాటు సిబిల్​ స్కోర్​లో కోత తప్పదని దిగులు చెందుతున్నారా? ఇక ఆ ఆందోళన అవసరం లేకుండా ఓ చిన్నపాటి వెసులుబాటు కల్పించింది రిజర్వ్ బ్యాంక్. అదేంటో తెలుసుకోండి..

credit card late fee waiver
RBI కొత్త రూల్స్.. క్రెడిట్‌ కార్డ్ బిల్​ కట్టడం లేటైనా ఓకే.. కానీ ఓ షరతు!

By

Published : Oct 13, 2022, 8:31 AM IST

వ్యక్తిగత అత్యవసరాలు ఎదురవడమో లేదా బిల్లు కట్టే చివరి తేదీ మర్చిపోవడమో.. కారణమేదైనా కొన్నిసార్లు క్రెడిట్‌ కార్డు చెల్లింపులు ఆలస్యమవుతుంటాయి. అలా జరిగినప్పుడు ఆలస్య రుసుము, వడ్డీ వంటి అదనపు ఛార్జీలను భరించక తప్పదు. దీనికి తోడు సిబిల్‌ స్కోరు కూడా తగ్గుతుంది. మరి ఇలా గడువు తేదీ మర్చిపోయినప్పుడు కార్డుదారులపై అదనపు భారం పడకుండా ఏదైనా ఉపశమనం ఉందా? అంటే ఓ చిన్న వెసులుబాటు ఉందంటోంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ). అయితే అది మూడు రోజుల వరకు మాత్రమే..!

Credit card late fee waiver : క్రెడిట్‌ కార్డుల వినియోగం విషయంలో ఆర్‌బీఐ ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా క్రెడిట్‌ కార్డు వ్యాపార నిర్వహణకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం క్రెడిట్‌ కార్డు జారీ చేసే సంస్థలు.. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు 'బకాయి పడిన రోజుల'(past Due) గురించి సమాచారమివ్వాలి. ఆ పాస్ట్‌ డ్యూ మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే ఖాతాదారులపై ఛార్జీల వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అంటే, గడువు తేదీ లోపు మీరు క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకపోతే.. అప్పుడు మీ క్రెడిట్‌ కార్డు ఖాతాను 'పాస్ట్‌ డ్యూ(బకాయి రోజులు)'గా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు రిపోర్ట్‌ చేసి, ఛార్జీలు విధిస్తుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. బకాయి చెల్లించాల్సిన తేదీకి మూడు రోజుల తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతేనే.. ఆలస్య రుసుము, వడ్డీ వంటి ఛార్జీలను విధించాల్సి ఉంటుంది. అంటే బిల్లు కట్టే గడువు దాటినా కూడా.. మూడు రోజుల్లోపు ఎలాంటి ఛార్జీలు లేకుండానే కార్డుదారులు ఆ బిల్లును చెల్లించుకోవచ్చు. అయితే, మూడు రోజుల తర్వాత కార్డు బిల్లును చెల్లిస్తే గనుక.. ఆలస్య రుసుము ఛార్జీలను క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న గడువు తేదీ నుంచి లెక్కిస్తారు. అయితే, ఈ ఛార్జీలు కూడా కేవలం అవుట్‌స్టాండింగ్‌ అమౌంట్‌ మీద మాత్రమే వేయాల్సి ఉంటుంది. అంతేగానీ, మొత్తం బాకీ మీద వసూలు చేయకూడదని ఆర్‌బీఐ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details