RBI New Guidelines :ఇన్ఆపరేటివ్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా, బ్యాంకులు ఖాతాదారులపై ఎలాంటి జరిమానాలు విధించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. స్కాలర్షిప్ డబ్బుల కోసం, డైరెక్ట్ బెనిఫిట్ బదిలీల కోసం తెరచిన ఖాతాలను రెండేళ్లకు మించి ఉపయోగించకపోయినా, వాటిని ఇన్ఆపరేటివ్ అకౌంట్లుగా పరిగణించకూడదని పేర్కొంది.
ఏప్రిల్ 1 నుంచి అమలు
క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆర్బీఐ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వీటిలో భాగంగానే ఇన్ఆపరేటివ్ బ్యాంకు ఖాతాల గురించి స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధనలు అన్నీ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, మినిమం బ్యాలెన్స్ లేదని, రెండేళ్లుగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేదనే నెపంతో, బ్యాంకులు ఖాతాదారులపై పెనాల్టీలు వేయకూడదు.
"క్లెయిమ్ చేయని డిపాజిట్లను, అసలైన ఖాతాదారులకు లేదా వారి నామినీలకు లేదా కుటుంబీకులకు అందించేందుకు ఈ తాజా నిబంధనలు ఉపకరిస్తాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ సహా బ్యాంకులు అన్నీ గణనీయంగా కృషి చేస్తున్నాయి."
- ఆర్బీఐ సర్క్యులర్
కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్, లెటర్స్ పంపించి, క్లెయిమ్ చేయని వారి ఖాతాల గురించి స్పష్టంగా తెలియజేయాలి. ఒక వేళ ఖాతాదారుడు స్పందించకపోతే, అతనిని పరిచయం చేసిన వ్యక్తిని లేదా నామినీలను కచ్చితంగా సంప్రదించాలి.