RBI New Guidelines For NBFCs: మధ్య, భారీ స్థాయి బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల కోసం నిర్దిష్ట సూత్రాలు, ప్రమాణాలు, ఇతరత్రా ప్రక్రియలను సోమవారం ఆర్‌బీఐ విడుదల చేసింది. ఎన్‌బీఎఫ్‌సీలకు 2021 అక్టోబరులో సవరించిన నియంత్రణ నిబంధనలను ఆర్‌బీఐ జారీ చేసిన సంగతి తెలిసిందే. దాని కింద పై స్థాయి(అప్పర్ లేయర్), మధ్య స్థాయి(మిడిల్ లేయర్) ఎన్‌బీఎఫ్‌సీలు ఒక స్వతంత్ర కాంప్లియన్స్ విధానం, ఒక చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్(సీసీఓ)ను కలిగి ఉండాలి. కార్పొరేట్ పాలనకు తోడు నిబంధనలను పాటించేలా చూడడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. 'ఇందుకు అనుగుణంగానే మధ్య, పై స్థాయి ఎన్‌బీఎఫ్‌సీలకు కొన్ని సూత్రాలు, ప్రమాణాలు, ప్రక్రియలను తీసుకురావాలని నిర్ణయించిన'ట్లు సోమవారం విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. 'బోర్డు/బోర్డు కమిటీలు నిబంధనలను పాటించే విషయంలో సరైన విధానాన్ని తీసుకువచ్చి, అమలయ్యేలా చూడాలి. వాటిని గడువుల వారీగా సమీక్షించాలి' అని కూడా తెలిపింది. ఆస్తుల పరిమాణంతో సంబంధం లేకుండా డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్‌బీఎఫ్‌సీలు; రూ.1,000 కోట్లు అంత కంటే ఎక్కువ ఆస్తులున్న ఎన్‌బీఎఫ్‌సీలు; కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు నిర్వహించే ఎన్‌బీఎఫ్‌సీలు మధ్య స్థాయి ఎన్‌బీఎఫ్‌సీల కిందకు వస్తాయి. ఏ ఇతర అంశాలతో సంబంధం లేకుండా.. ఆస్తుల పరిమాణంలో అగ్రగామిగా ఉన్న 10 సంస్థలన్నీ పైస్థాయి ఎన్‌బీఎఫ్‌సీల కిందకు వస్తాయి. ఆర్‌బీఐ సర్క్యులర్ ప్రకారం..
*సీసీఓను మూడేళ్ల కంటే తక్కువ కాకుండా ఒక స్థిర పదవీ కాలానికి నియమించాలి. అయితే కొన్ని పరిస్థితుల్లో కనీస పదవీ కాలానికి ఏడాది పాటు మినహాయింపునివ్వవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా నియామకాన్ని చేపట్టాల్సి ఉంటుంది.
*అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీసీఓ బదిలీ, తొలగింపు ఉండాలి. సదరు ఎన్‌బీఎఫ్‌సీలో సీసీఓ ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండాలి. సీఈఓ కంటే రెండు స్థాయిల కంటే దిగువ ఆ స్థానం ఉండరాదు.
*సీసీఓకు వ్యాపారాలకు సంబంధించిన ఏ ఇతర హోదా అప్పజెప్పరాదు.
*పై స్థాయి, మధ్య స్థాయి ఎన్‌బీఎఫ్‌సీలు బోర్డు ఆమోదించిన విధానం; నిబంధనల కార్యకలాపాల(సీసీఓ నియామకం సహా)ను 2023 ఏప్రిల్ 1 నుంచి 2023 అక్టోబరు 1లోగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్- ఆ ట్రేడింగ్ సమయం మార్పు - trading times changed
RBI New Guidelines For NBFCs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మధ్య, భారీ స్థాయి బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల కోసం నిర్దిష్ట సూత్రాలు, ప్రమాణాలు, ఇతరత్రా ప్రక్రియలను సోమవారం విడుదల చేసింది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రణలో ఉండే స్టాక్ మార్కెట్లలో ఈ నెల 18 నుంచి ట్రేడింగ్ ఉదయం 9 గంటలకే ప్రారంభమై, సాయంత్రం 3.30 గంటలకు ముగియనుంది.
18 నుంచి ఉదయం 9 గంటలకే ఆర్‌బీఐ నియంత్రిత మార్కెట్లలో ట్రేడింగ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రణలో ఉండే మార్కెట్లలో ఈ నెల 18 నుంచి ట్రేడింగ్ ఉదయం 9 గంటలకే ప్రారంభమై, సాయంత్రం 3.30 గంటలకు ముగియనుంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ట్రేడింగ్ సమయాలను 2020 ఏప్రిల్ 7 నుంచి మార్చారు. అదే ఏడాది నవంబరు 9 నుంచి ట్రేడింగ్ సమయాన్ని సవరించి ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యేలా మార్పులు చేశారు. ఇప్పటి వరకు అదే పాటిస్తున్నారు. కొవిడ్‌కు ముందులానే ఈ నెల 18 నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య ట్రేడింగ్ జరగనుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాల్/నోటీస్/టర్మ్ మనీ, మార్కెట్ రెపో గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రై-పార్టీ రెపో ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, వాణిజ్య పత్రాలు, డిపాజిట్ల సర్టిఫికెట్లు, రెపో ఇన్ కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు (కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, ట్రెజరీ బిల్లులు), విదేశీ మారకం (ఎఫ్‌సీవై), భారత రూపాయి (ఐఎన్‌ఆర్) ట్రేడ్లు, ఫారెక్స్ డెరివేటివ్స్, రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్స్ తదితర మార్కెట్లు ఆర్‌బీఐ నియంత్రణలో నడుస్తున్నాయి.
ఇదీ చదవండి:టీసీఎస్ లాభాలు అదరహో.. త్రైమాసిక ఆదాయంలో మైలురాయి