RBI mpc outcome: నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. కీలక వడ్డీ రేట్లను వరుసగా 11వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతున్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. 2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది ఆర్బీఐ. ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4శాతానికి దిగొచ్చింది.
'వడ్డీ రేట్లు యథాతథం- కొంతకాలం ధరల భారం ఖాయం!' - ఆర్బీఐ సమీక్ష
10:14 April 08
కీలక వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా 11వ సారి...
భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త, పెను సవాలును ఎదుర్కొంటోందని రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు శక్తికాంత దాస్. ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వల్ల కలిగిన లాభాలను.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. అయితే.. విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్బీఐ సర్వసన్నద్ధమై ఉందని స్పష్టం చేశారు.
- భారత దేశ ఆర్థిక వృద్ధిపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.
- 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
- పెట్రో మంటతో ద్రవ్యోల్బణం మరింత(4.5శాతం నుంచి 5.7శాతానికి) పెరుగుతుందని, వంట నూనెల ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయని చెప్పారు శక్తికాంత దాస్.
ఇవీ చూడండి:అగ్రస్థానం అంబానీదే.. అత్యంత చేరువలో అదానీ