RBI MPC 2023 LIVE Updates : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా ఐదో సారి కూడా రెపోరేటును 6.5 శాతం వద్దనే యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ, రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని 'ద్రవ్య పరపతి విధాన కమిటి' (MPC) ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాలు 7 శాతానికి పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ఉత్పాదక రంగం వృద్ధి చెందడం సహా, దేశీయంగా డిమాండ్ పెరుగుతుండడమే ఇందుకు కారణమని పేర్కొంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
- అక్టోబర్‌లో దేశీయ ద్రవ్యోల్బణం 4.87 శాతానికి తగ్గింది. నవంబర్ నెల ద్రవ్యోల్బణం వివరాలను మరో వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
- వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (CPI)ను ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో 4% వద్ద ఉంచాలని ఆర్బీఐని ప్రభుత్వం ఆదేశించింది.
- భారతదేశంలో 2023 డిసెంబర్ 1నాటికి 604 బిలియన్ల మేరకు ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
యూపీఐ పేమెంట్స్ పరిమితి పెంపు!
- ఆసుపత్రులు, విద్యాలయాల్లో పేమెంట్స్ చేయడానికి ఇప్పుడున్న యూపీఐ పేమెంట్స్ పరిమితిని.. ఒక్కో లావాదేవీకి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు ఆర్బీఐ పెంచింది.
- రికరింగ్ చెల్లింపుల ఇ-మ్యాండేట్ పరిమితి రూ.15 వేలు నుంచి రూ.1 లక్షకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.