Charges On UPI Payment: ప్రస్తుతం జేబులో రూపాయి లేకపోయినా.. బ్యాంక్ ఖాతాలో నగదు ఉండి, చేతిలో మొబైల్ ఉంటే చాలు.. ధైర్యంగా దుకాణాలకు వెళ్లిపోతున్నాం. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. లేదా సంబంధిత వ్యాపారి ఫోన్ నెంబరు తీసుకుని, అతని మొబైల్‌కు నగదు బదిలీ చేసే వీలుండటమే ఇందుకు కారణం. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు రూపొందించిన యూపీఐ ఒక విప్లవంగానే చెప్పొచ్చు. సురక్షితంగా, అత్యంత సులభంగా, లావాదేవీ వ్యయం లేకుండా నగదును బదిలీ చేసుకునే వీలుండటం దీని బలం. కానీ, యూపీఐ లావాదేవీలపైనా ఛార్జీలను వసూలు చేసేందుకు ఉన్న అవకాశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయం కోరుతూ 'చెల్లింపుల వ్యవస్థల్లో ఛార్జీలు' అనే చర్చా పత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిపై అక్టోబరు 3 లోపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరుతోంది.
కార్డుల తరహాలో
సాధారణంగా క్రెడిట్ కార్డు లావాదేవీలు నిర్వహించినప్పుడు మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఛార్జీలను విధిస్తుంటారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు పంచుకుంటాయి. ఇదే విధంగా యూపీఐ లావాదేవీలపైనా ఎండీఆర్ తరహా ఛార్జీలను విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్థంగా సేవలను అందిస్తాయని ఆర్‌బీఐ భావిస్తోంది. ఎండీఆర్ తరహాలోనే లావాదేవీ మొత్తంపై నిర్ణీత శాతాన్ని రుసుముగా వసూలు చేయాలా? లేదా లావాదేవీకి స్థిరంగా కొంత మొత్తం వసూలు చేయాలా అన్న విషయాన్నీ చర్చా పత్రంలో ప్రస్తావించింది.
ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్), రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్)తోపాటు, డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) తదితరాలకూ ఛార్జీల ప్రతిపాదనను చేసింది. విధివిధానాలు, నిబంధనలు, ఇతర అంశాలపైనా సూచనలివ్వాలని కోరుతోంది.
డిజిటల్ చెల్లింపులకు అవరోధం ఏర్పడకుండా..
డిజిటల్ చెల్లింపుల సేవలు అందించేందుకూ కంపెనీలకు కొంత ఖర్చు అవుతోంది. దీన్ని వ్యాపారులు లేదా వినియోగదారులు భరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గతంలోనే పేర్కొంది. ఇందుకు విధించే ఛార్జీల వల్ల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు అవరోధం ఏర్పడకూడదనీ భావిస్తోంది. అందుకే డిజిటల్ చెల్లింపుల సేవలను వినియోగించే అందరి నుంచీ అభిప్రాయాలు సేకరించేందుకే చర్చాపత్రం తీసుకొచ్చిందని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.