RBI interest rate decision today :రుణగ్రహీతలపై మరో పిడుగు పడింది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్లను మరోసారి పెంచింది రిజర్వ్ బ్యాంక్. అంతకంతకూ విజృంభిస్తున్న ధరల భూతానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఆర్‌బీఐ పెంచడం వరుసగా ఇది మూడోసారి.
వేతన జీవులపై మరో పిడుగు.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం - rbi loan emi news today
09:35 August 05
కీలక వడ్డీ రేట్లు మరోసారి పెంచిన రిజర్వ్ బ్యాంక్
RBI interest rate hike 2022 : ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీ రేట్లను మరోమారు పెంచింది రిజర్వు బ్యాంకు. అందరూ ఊహించినదానికన్నా ఎక్కువగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచి 5.4శాతంగా నిర్ణయించింది. ఫలితంగా రెపో రేటు(బ్యాంకులకు ఇచ్చిన అప్పులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) కొవిడ్ ముందు స్థాయికి చేరింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించిన ద్రవ్యపరపతి విధాన కమిటీ.. ఈమేరకు శుక్రవారం ప్రకటన చేసింది. శక్తికాంత దాస్ చెప్పిన కీలక విషయాలు:
- ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించింది. మాంద్యం ముప్పు ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. భారత్ నుంచి గత కొద్ది నెలల్లో 13.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి. అయితే.. ఫైనాన్షియల్ సెక్టార్ బాగానే ఉంది. భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు.. అంతర్జాతీయ ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తాయి.
- వినియోగదారుల ధరల సూచీ అధికంగా ఉంది. కొంతకాలం 6శాతంపైనే కొనసాగే అవకాశముంది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.4శాతం చేయాలని ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అకామొడేటివ్ స్టాన్స్‌ను వీడడంపై దృష్టిపెట్టాలని తీర్మానించింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2శాతం వృద్ధి నమోదు కావొచ్చన్న అంచనాలకు కట్టుబడి ఉన్నాం. సాధారణ వర్షపాతం, ముడి చమురు బ్యారెల్ ధర 105 డాలర్లు ఉండొచ్చన్న లెక్కలతో.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7శాతం నమోదవుతుందన్న అంచనాలను అలానే కొనసాగిస్తున్నాం. అయితే.. అంతర్జాతీయ పరిణామాలు దేశ ఆర్థిక వృద్ధికి ప్రతికూలంగా మారే అవకాశముంది.
- వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయి.
ద్రవ్యోల్బణం ఆరు శాతంలోపు ఉండేలా చూడాలని రిజర్వు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరలు, ఇతర కారణాలతో జనవరి నుంచి ధరల సూచీ ఎగువ స్థాయిలోనే కొనసాగుతోంది. జూన్‌లో 7.01శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం 15.18శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపే ఉత్తమ మార్గమని భావించిన ఆర్‌బీఐ.. అందుకు అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకుంది.
RBI rate hike 2022 : 2020 ఆరంభంలో కరోనా వ్యాప్తికి ముందు రెపో రేటు 5.15శాతంగా ఉండేది. కొవిడ్ ముందే వృద్ధిరేటు మందగించడంతో, రెపోరేటును 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ తగ్గిస్తూ వచ్చింది. కొవిడ్ తొలిరోజుల్లో 2020లో మార్చి, మే నెలల్లో 75 బేసిస్ పాయింట్లు; 40 బేసిస్ పాయింట్ల చొప్పున కోత వేసింది. 2019 నుంచి 2020 మేలోపు రెపోరేటులో 250 బేసిస్ పాయింట్ల మేర కోత విధించి, రికార్డు కనిష్ఠమైన 4 శాతానికి చేర్చింది. ఆ తర్వాత 11 సార్లు ద్వైమాసిక సమీక్ష జరిగినా, రేట్లు సవరించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మేలో ద్వైమాసిక సమీక్ష లేకపోయినా.. 40 బేసిస్ పాయింట్లు పెంచి, 4.40 శాతం చేసింది. జూన్‌లో జరిగిన ద్వైమాసిక సమీక్షలో మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.90 శాతం చేసింది. ఇప్పుడు వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల పెంపుతో.. రెపో రేటు కొవిడ్ ముందు స్థాయిని దాటింది.