RBI Interest Rate 2023 : ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసారి కూడా రెపోరేటును స్థిరంగానే ఉంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలో రేట్లను పెంచడం వల్లే ద్రవ్యోల్బణం దిగొస్తోందని పేర్కొన్నారు.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కిమిటీ జూన్ 6-8 మధ్య సమావేశం కానుంది. సమావేశ నిర్ణయాలను జూన్ 8న ప్రకటించనున్నారు. చివరిసారి ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతం దగ్గర కొనసాగించారు. దీంతో 2022 మే నుంచి అనుసరిస్తున్న రేట్ల పెంపు ప్రక్రియకు విరామమిచ్చినట్లయింది. వరుస పెంపులతో రెపో రేటు 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యల్బణం (సీపీఐ) ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ఠ స్థాయి 4.7 శాతానికి తగ్గిన నేపథ్యంతో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశమవుతోంది. మే నెలకు సంబంధించిన 'సీపీఐ'ని జూన్ 12న ఆర్‌బీఐ ప్రకటించనుంది. "ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 5 శాతం వరకు తగ్గింది. మే నెలలో ఇది మరికాస్త తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచే అవకాశం ఉంది." అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు.
డిపాజిట్లు పెరిగే అవకాశం!
"రూ.2000 వేల నోట్ల ఉపసంహరణ చేపట్టి నేపథ్యంలో బ్యాంక్ డిపాజిట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకుల్లో లిక్విడిటీ పెరిగింది. దీనితోపాటు రుతుపవనాల పురోగతి, ఖరీఫ్ పంటపై ఎల్‌నినో చూపే దుష్ప్రభావాలను కూడా ఆర్‌బీఐ సమీక్షిస్తుంది" అని మదన్ సబ్నవీస్ పేర్కొన్నారు.
రెపోరేటు తగ్గించే అవకాశం?
REPO RATE : ఆర్‌బీఐ ఈ సంవత్సరం రెపోరేటును 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఇది అక్టోబర్ తరువాత మాత్రమే జరిగే అవకాశం ఉందని మదన్ సబ్నవీస్ అన్నారు. 'సీపీఐ' ద్రవ్యోల్బణాన్ని అటుఇటుగా 2 శాతం మార్జిన్‌తో 4 శాతంగా నిర్ధరించాలని ప్రభుత్వం ఆర్బీఐని కోరిందని.. బ్యాంకర్లు కూడా ఇదే ఆశిస్తున్నారని ఆయన తెలిపారు.