తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ షాక్.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం - ఆర్​బీఐ వార్తలు

rbi interest rate 2022
ఆర్​బీఐ సర్​ప్రైజ్.. వడ్డీ రేట్లు పెంపు

By

Published : May 4, 2022, 2:22 PM IST

Updated : May 4, 2022, 6:09 PM IST

14:16 May 04

ఆర్​బీఐ సర్​ప్రైజ్.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం!

RBI interest rate 2022: ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెపో రేటను 40 బేసిస్​ పాయింట్ల మేర పెంచి.. 4.4శాతంగా నిర్ణయించినట్లు వెల్లడించారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని, ఫలితంగా వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిందని వివరించారు. రేట్ల పెంపునకు ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు చెప్పారు.

రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింత పెరుగుతాయని శక్తికాంతదాస్​ అంచనా వేశారు. ఎరువుల ధరలు., ఇతర పెట్టుబడి ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా గోధుమల దిగుబడి బాగానే ఉన్నప్పటికీ, ఇతర దేశాల్లో కొరత ఇక్కడ ప్రభావం చూపుతోందన్నారు. అంతర్జాతీయంగా వస్తు లభ్యతలో కొరత, మార్కెట్‌లో ఒడుదొడుకులు తీవ్రమవుతున్నాయని వివరించారు. ప్రపంచ ఆర్థిక పురోగమనం మందగించిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పలేదని వివరించారు.

RBI News: ద్రవ్యోల్బణం గత మూడు నెలలుగా నిర్దేశిత లక్ష్యం 6శాతం కంటే ఎక్కువగా ఉంది. ఏప్రిల్​లో కూడా ఇది ఎక్కువగానే ఉండే సూచనలు కన్పిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. టోకు ద్రవ్యోల్బణం మార్చిలో 6.9శాతంగా నమోదైందని గుర్తు చేశారు. ఈ కారణంగా వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నగదు నిల్వల నిష్పత్తిని (CRR) 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.5 శాతంగా నిర్ణయించినట్లు ఆర్​బీఐ ప్రకటించింది. మే 21 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. దీని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 87,000 కోట్ల లిక్విడిటీ రూపంలో తీసుకోనుంది. సీఆర్​ఆర్​ అంటే బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో లిక్విడ్​ క్యాష్​ను మెయింటెన్ చేయాల్సిన శాతం.

RBI Repo Rate: 2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది ఆర్​బీఐ. ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4శాతానికి దిగొచ్చింది. ఆ తర్వాత వరుసగా 11 సార్లు ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిగినా.. వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా ఆర్​బీఐ ఎంపీసీ సమావేశం నిర్వహించి.. వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది.

గృహ రుణ గ్రహీతలకు గట్టి దెబ్బే:కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఉదాహరణకు: రవి ఏదైనా బ్యాంకు నుంచి 20 ఏళ్ల కాలానికి రూ.20 లక్షలు రుణం తీసుకున్నారనుకుందాం. ప్రస్తుత వడ్డీ రేటు 6.8 శాతం అనుకుంటే అతడు నెలకు ఈఎంఐ కింద రూ.15,267 చెల్లించాల్సి ఉంటుంది. రవిలానే కొత్తగా ఇల్లు కొందామని రాహుల్‌ కొత్తగా రుణం (వడ్డీ రేట్లు పెంచాక) తీసుకోవాలనుకుంటే.. ఇదే మొత్తం, ఇదే కాలానికి 7.2 శాతం వడ్డీ రేటు కింద రూ.15,747 ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రవి కంటే రాహుల్‌ అదనంగా నెలకు దాదాపు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నమాట.

ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా వడ్డీ కట్టే మొత్తం పెరుగుతుంది. కాబట్టి వడ్డీ భారం పడకుండా ఉండాలంటే ముందుగానే రుణాలు తీర్చడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలి. అదే ఆటో లోన్‌, పర్సనల్‌ లోన్‌ తీసుకుని.. ఫిక్స్‌డ్‌ రేట్‌ను ఎంచుకున్నట్లయితే మీపై ఈ వడ్డీ రేట్ల ప్రభావం ఉండబోదు. ఈఎంఐని యథావిధిగా కట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటే వెంటనే బ్యాంకులను లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. త్వరలోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వడ్డీ రేట్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

వారికి గుడ్‌న్యూస్‌:ఆర్‌బీఐ తీసుకున్న అనూహ్య నిర్ణయం ప్రభావంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకునే వారికి ఇకపై అధిక వడ్డీ లభించనుంది. ప్రస్తుతం ఎఫ్‌డీలపై అందిస్తున్న వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటోంది. దీంతో సురక్షిత పొదుపు పథకం అయినప్పటికీ తక్కువ వడ్డీ రేట్లు కారణంగా చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఆ మేరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తొలి దశలో స్వల్పకాలిక, మధ్యకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది.

Last Updated : May 4, 2022, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details