RBI Interest Rate Hike : ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం వడ్డీ రేటు 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేయగా తాజాగా దీనిని 7 శాతానికి కుదించింది ఆర్‌బీఐ. ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతంగా అంచనా వేసింది.
దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి స్వల్పంగా తగ్గిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వ్యవసాయ రంగ వృద్ధి నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. పీఎల్‌ఐ స్కీమ్‌తో పారిశ్రామిక వృద్ధి ఆశాజనకంగా మారిందని పేర్కొన్నారు. 'అమెరికా డాలర్ గరిష్ఠానికి చేరింది. ఆహార, ఇంధన ధరలు పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక విధానాల పర్యవసానాల ప్రభావాన్ని చవిచూస్తున్నాం. ప్రపంచ దేశాల వృద్ధి మందగించింది. ఇవన్నీ వర్ధమాన దేశాలకు ఓ సవాల్‌గా నిలుస్తున్నాయి' అని దాస్ అన్నారు.
ఈ ఏడాది మే నుంచి నాలుగు నెలలో వ్యవధిలో 190 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును ఆర్‌బీఐ పెంచింది. ద్రవ్యోల్బణ నియంత్రణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, రుణ రికవరీపై ప్రభావం పడకుండా వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారత్‌లో 8 నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత 6 శాతానికి మించే కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మేలో 40 బేసిస్ పాయింట్లు, జూన్- ఆగస్టుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది.