తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ వడ్డీల మోతే.. మరోసారి రెపో రేటు పెంచిన రిజర్వు బ్యాంక్ - రెపో రేటు ఆర్​బీఐ న్యూస్

రిజర్వు బ్యాంకు మరోసారి రెపోరేటును పెంచింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

RBI increases the repo rate
RBI increases the repo rate

By

Published : Feb 8, 2023, 10:20 AM IST

Updated : Feb 8, 2023, 10:51 AM IST

దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేసే చర్యల్లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ తెలిపింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6.5శాతానికి చేరినట్లైంది. ఆర్​బీఐ పరపది విధాన సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకే సభ్యులు మద్దతు ఇచ్చారని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 4-2 తేడాతో వడ్డీ రేట్ల పెంపును ఆమోదించినట్లు చెప్పారు. 2023లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 6వ తేదీన ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షా సమావేశం మొదలైంది.

మూడేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఫలితంగా ద్రవ్యపరపతి విధానం విషయంలో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పారు. ఆర్థిక వ్యవహారాలు, ద్రవ్యోల్బణాన్ని సమన్వయం చేసుకునేందుకు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు నిరాశాజనకంగా ఏమీ లేవని అన్నారు.

"ద్రవ్యోల్బణం దిగివస్తోంది. గతంతో పోలిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంత నిరాశాజనకంగా ఏమీ లేదు. ప్రపంచంలో అనిశ్చితులు ఉన్న సమయంలోనూ భారత ఎకానమీ బలంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం దేశ వృద్ధికి విఘాతం కలిగించొచ్చు. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు 25 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు సమంజసమే."
-శక్తికాంత దాస్, ఆర్​బీఐ గవర్నర్

2022-23 లో భారత జీడీవీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆర్​బీఐ లెక్కగట్టింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 5.3 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. ఆసియా కరెన్సీలలో భారత రూపాయి మాత్రమే తక్కువ అనిశ్చితికి గురైందని శక్తికాంత దాస్ తెలిపారు. యూపీఐ సేవలను విదేశీ ప్రయాణికులకు సైతం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. జీ20 దేశాల ప్రయాణికులకు తొలుత వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

డిసెంబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటు 35 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చారు. అంతకు ముందు వరుసగా 3 సమీక్షల్లో 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. ఈ సారి పెంపు వేగం కొంత తగ్గి 25 బేసిస్‌ పాయింట్లకే పరిమతమైంది. రివర్స్‌ రెపోరేటు 3.35లో ఎటువంటి మార్పులు చేయలేదు. దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతిస్తుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లపై మధ్యస్థ వైఖరి ప్రదర్శిసుండటంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును స్వల్పంగా పెంచింది. గత ఏడాది మే నుంచి 225 బేసిస్‌ పాయింట్లు రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ తాజాగా మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచడం ద్వారా 6.5 శాతానికి చేర్చింది.

Last Updated : Feb 8, 2023, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details