దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిటర్లు లేదా వారి లబ్ధిదారులు జమ చేసి, పట్టించుకోని సొమ్ము (క్లెయిమ్ చేయని డిపాజిట్ల)ను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించనున్నట్లు ప్రకటించింది రిజర్వు బ్యాంకు. అందుబాటులోకి వచ్చే ఈ వెబ్సైట్లో అకౌంట్ హోల్డ్ర్లతో పాటు వారి నామినీలకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరుస్తామని ఆర్బీఐ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి గురువారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం ప్రకటించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
2023 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు బ్యాంకుల్లో ఎవరూ పట్టించుకోని డిపాజిట్లు రూ.35,000 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటినే ఆయా బ్యాంకులు ఆర్బీఐ నిర్వహించే 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్' (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేశాయి. ఇలాంటి వాటి వివరాలను యాక్సెస్ చేయడానికి ప్రత్యేకంగా ఓ సెంట్రలైజ్డ్ పోర్టల్ వ్యవస్థను తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం రిజర్వు బ్యాంకు ప్రకటించింది.
ఏ బ్యాంకుల్లో ఎంత?
రిజర్వు బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.8,086 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లతో మొదటి స్థానంలో ఉంది. రూ.5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, రూ.4,558 కోట్లతో కెనరా బ్యాంక్, రూ. 3,904 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.