తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆ కారుకు నా మనసులో ప్రత్యేక స్థానం'.. రతన్‌ టాటా భావోద్వేగ పోస్టు - ఇండికా కారుతో రతన్ టాటా

టాటా మోటార్స్‌ రూపొందించిన ఓ కారుపై తనకున్న ప్రేమను చాటుకున్నారు రతన్ టాటా. మధురమైన జ్ఞాపకాలను ఆ కారు తనకు గుర్తు చేస్తుందని తెలిపారు.

RATAN TATA INDICA
RATAN TATA INDICA

By

Published : Jan 16, 2023, 7:00 AM IST

దేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తల్లో రతన్‌ టాటా ఒకరు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని సరికొత్త ఉత్పత్తులతో కొత్త పుంతలు తొక్కించారు. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలు నిరుపమానం. టాటా గ్రూపు ఛైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత ఆయన టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రతన్‌ టాటా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తరచూ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటుంటారు. తాజాగా ఆయన టాటా మోటార్స్‌ రూపొందించిన టాటా ఇండికా కారుపై తనకున్న ప్రేమను చాటుతూ ఒక పోస్టు పెట్టారు. ఇండికా కారు పక్కన నిల్చున్నప్పుడు తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. "25 సంవత్సరాల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడం భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు గుర్తుచేస్తుంది. నా హృదయంలో ఈ కారుకు ప్రత్యేక స్థానం ఉంది" అంటూ రాసుకొచ్చారు.

టాటా మోటార్స్‌ సంస్థ తన ప్యాసింజర్‌ కార్ల తయారీ ప్రస్థానాన్ని 1998లో ఇండికాతో మొదలు పెట్టింది. దేశీయంగా రూపుదిద్దుకున్న ఇండికా చిన్న కార్ల శ్రేణిలో విడుదలైన అనతికాలంలోనే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా క్యాబ్‌ సర్వీసులు ప్రారంభమైన తొలి నాళ్లలో ఇండికా కారునే ఎక్కువగా ఉపయోగింవేవారు. అప్పట్లో క్యాబ్‌ అనే పదానికి ఇండికా కారు ప్రత్యమ్నాయంగా మారిపోయింది. తర్వాత ఇండికాలో విస్టా, మాంజా అనే మోడల్స్‌ను విడుదల చేసినప్పటికీ, అమ్మకాల్లో పెద్దగా రాణించలేకపోయాయి. దీంతో 2018లో టాటా మోటార్స్‌ ఇండికా తయారీని నిలిపివేసింది. రతన్‌ టాటా ఇన్‌స్టాలో పోస్ట్‌ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 20 లక్షల మందిపైగా లైక్‌ చేశారు. అంతేకాకుండా టాటా ఇండికా కారుతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details