Raksha Bandhan Financial Gifts: అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా 'రక్షగా నిలవడం' అనే పదానికి విస్తృతి పెరిగిందనే చెప్పాలి. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, ఉద్యోగ భద్రతపై అనుమానాలు నెలకొన్న ఈ తరుణంలో కేవలం భౌతిక రక్షణే కాకుండా ఆర్థికంగానూ వారికి భరోసానివ్వాలి. అదే అక్కాచెల్లెళ్లకిచ్చే నిజమైన బహుమతి.
బీమాతో ధీమా ఇవ్వండి..
కేవలం అక్కాచెల్లెళ్ల ఆరోగ్యానికే కాదు.. వారి భవిష్యత్తుకూ భరోసా కల్పించాలి. అందుకు బీమా పాలసీ కొనిపెట్టడం ఓ మంచి మార్గం. వారికోసం టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవాలి. ఎంత తక్కువ వయసులో తీసుకుంటే వారికి అంత ప్రయోజనం. దీనివల్ల భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది. మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో వారికి మంచి బహుమతి ఇచ్చినవారమవుతాం.
ఓ మంచి ప్రణాళికను సిద్ధం చేయండి..
ఒకవేళ మీ అక్కాచెల్లెళ్లకు ఆర్థిక వ్యవహారాలపై పెద్దగా అవగాహన లేకపోతే.. వారికి ఓ నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి ఇవ్వండి. ఆమె భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయండి. చదువు, ఉద్యోగం, మదుపు, పొదుపు, వివాహానంతర జీవితం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వారికి ఆర్థిక భరోసానిచ్చే చక్కటి ప్రణాళికను వారి చేతిలో పెట్టండి. అవసరమైతే.. ఆర్థిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేయండి.
మదుపు సాధనాలను సూచించండి..
దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే మదుపు మార్గాలను మీ సోదరికి సూచించండి. చదువుకునే వయసులోనే వారికి ‘పాకెట్ మనీ’ని ఎలా పొదుపు చేయాలో చెప్పండి. చేసిన పొదుపును పోస్టాఫీసు ఖాతాల్లో మదుపు చేయించండి. వచ్చే రాబడి ఎలా ఉంటుందో వారికి వివరించండి. తక్కువ వయసులో ప్రారంభించి దీర్ఘకాలంలో దాన్ని కొనసాగించడం వల్ల ఉండే ప్రయోజనాల్ని సోదాహరణతో చెప్పండి. సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్ ఖాతా.. వంటి ప్రాథమిక ఆర్థిక మదుపు సాధనాలను వారికి పరిచయం చేయండి. ఒకవేళ మీ అక్కాచెల్లెళ్లు పెద్దవారైతే.. మ్యూచువల్ ఫండ్స్, సిప్, స్టాక్ మార్కెట్, బాండ్స్ వంటి పెద్ద పెద్ద పెట్టుబడి మార్గాల్లో ఉండే ప్రయోజనాల్ని వివరించండి.