Raksha Bandhan Gift Ideas : అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ (రాఖీ పండుగ). భారతదేశంలో ఈ పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున అక్కచెల్లెళ్లు.. తమ అన్నదమ్ములకు ప్రేమతో రాఖీని కడతారు. ప్రతిఫలంగా వాళ్లకు అన్నదమ్ములు ప్రత్యేకమైన కానుకలు ఇస్తారు. అవి డబ్బులు కావచ్చు.. లేదా స్మార్ట్ఫోన్లు, కాస్మోటిక్స్, కొత్త దుస్తులు ఇలా ఏమైనా కావచ్చు. అయితే ఇవి ఎప్పుడూ ఇచ్చే బహుమతులే. కానీ ఈసారి ఓ సరికొత్త గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ సోదరీమణుల భవిష్యత్ కోసం, వారి ఆర్థిక భద్రత కోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పిన ఫైనాన్సియల్ గిఫ్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి.
Best Gift Ideas Raksha Bandhan
1. క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక (సిప్)
Systematic Investment Plan (SIP) : మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఒక మంచి కార్పస్ (ఆర్థిక నిధి) ఏర్పడుతుంది. ఇది మీ సోదరి ఆర్థిక భవిష్యత్‌కు ఎంతో తోడ్పడుతుంది. అందుకే ఇప్పటి నుంచే మీ సోదరి పేరు మీద ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌ను తీసుకొని, సిప్‌ను ప్రారంభించండి.
2. ఆరోగ్య బీమా పాలసీ
Health Insurance Policy : నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉండి తీరాల్సిందే. అందుకే మీ సోదరికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా ఇప్పుడే.. ఆమె పేరు మీద మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం.
3. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్
Bank Savings Account :భవిష్యత్ బంగారుమయంగా ఉండాలంటే.. పొదుపు, మదుపు తప్పనిసరి. వాస్తవానికి ఇవి ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత మంచిది. అందుకే మీరు మీ సోదరీమణుల పేరు మీద బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడం మంచిది.
4. డీమ్యాట్ అకౌంట్
Demat Account : రోజురోజుకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మన రాబడి కూడా పెరగాల్సి ఉంటుంది. ఇందుకోసం కేవలం పొదుపు చేస్తే సరిపోదు. వీలైనంత త్వరగా మదుపు చేయడం ప్రారంభించాలి. అందుకే మీ అక్క లేదా చెల్లెలు పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని, మంచి క్వాలిటీ స్టాక్స్‌లో దీర్ఘకాలంపాటు పెట్టుబడి కొనసాగించేలా వారిని ప్రోత్సహించండి. ఇది వారి భవిష్యత్‌కు బాగా ఉపయోగపడుతుంది.