ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఝున్‌ఝున్‌వాలా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలోని బీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని 'ఆకాశ ఎయిర్' వర్గాలు వెల్లడించాయి.
బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం - రాకేశ్ ఝున్ ఝున్ వాలా కన్నుమూత
09:19 August 14
బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
హైదరాబాద్‌లోని రాజస్థానీ కుటుంబంలో జన్మించిన ఆయన.. ముంబయిలో పెరిగారు. వీరి పూర్వీకులది రాజస్థాన్‌లోని ఝున్జునూ. ఝున్‌ఝున్‌వాలా తండ్రి ఆదాయ పన్ను శాఖలో కమిషనర్‌గా పనిచేసేవారు. సెడెన్హమ్ కళాశాలలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యారు.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా ఝున్‌ఝున్‌వాలా అందరికీ సుపరిచితులు. భారత స్టాక్ మార్కెట్లపై సానుకూల దృక్ఫథంతో వ్యవహరించేవారు. బుల్ మార్కెట్‌ను విశ్వసించేవారు. ఆయన కొనుగోలు చేసిన షేర్లలో చాలా వరకు కాసుల వర్షం కురిపించాయి. ఆర్ఏఆర్ఈ ఎంటర్ప్రైజెస్ పేరుతో ప్రైవేటు స్టాక్ ట్రేడింగ్ కంపెనీని నడిపించారు. ఆయన ఆస్తి విలువ రూ.46వేల కోట్లు. దీంట్లో సింహ భాగం స్టాక్ మార్కెట్ ద్వారానే సంపాదించారు. 'వారెన్ బఫేట్ ఆఫ్ ఇండియా' అని కూడా ఝున్‌ఝున్‌వాలాను పిలుస్తుంటారు. ఇటీవలే ప్రారంభమైన 'ఆకాశా ఎయిర్' విమానయాన సంస్థ యజమాని ఈయనే.
మోదీ విచారం
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక రంగానికి ఆయన ఎనలేని కృషి చేశారని మోదీ కొనియాడారు. దేశ పురోగతి విషయంలో సానుకూలంగా ఉండేవారని చెప్పారు. 'ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి' అని మోదీ ట్వీట్ చేశారు.