Raghuram Rajan comments: 'ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. ఇదేమీ విదేశీ పెట్టుబడుదార్లకు ప్రయోజనం కలిగించే జాతి విద్రోహ చర్యేమీ కాదు. ఆర్థిక స్థిరత్వానికి పెట్టుబడి లాంటిదని కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు తెలుసుకోవాలని' ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణంపై చేసే యుద్ధం ఎప్పటికీ ముగియదని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని నియంత్రణ కోసం మిగతా ప్రపంచం మాదిరే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచాల్సి వస్తుందని లింక్డ్‌ఇన్ పోస్టులో రాజన్ తెలిపారు.
తన హయాంలో:ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ ఉన్న సమయంలో అధిక వడ్డీ రేట్లు ఉన్నాయన్న విమర్శలపై మాట్లాడుతూ 'మూడేళ్ల కాలానికి ఆర్‌బీఐ గవర్నర్‌గా నేను 2013 సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించాను. అప్పుడు రూపాయి విలువ క్షీణత కారణంగా కరెన్సీ సంక్షోభం నడుస్తోంది. ద్రవ్యోల్బణం 9.5 శాతంగా ఉంది. దీన్ని అదుపులో ఉంచడానికి రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం దిగువకు రావడంతో రెపో రేటును 6.5 శాతానికి పరిమితం చేశాం' అని వివరించారు. ఆర్‌బీఐ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ, రూపాయి స్థిరత్వాన్ని సాధించాయన్నారు. 2013 ఆగస్టు నుంచి 2016 ఆగస్టు మధ్య ద్రవ్యోల్బణం 9.5% నుంచి 5.3 శాతానికి దిగి వచ్చింది. ఇందుకు ఆర్‌బీఐ చర్యలు కొంత కారణమయ్యాయి. ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు, వృద్ధిలో క్షీణత, కొవిడ్ సంక్షోభ సమయాల్లోనూ తక్కువ ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ కొనసాగించగలిగిందని అన్నారు.