తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.4.3లక్షల కోట్లకు భారత మీడియా, వినోద రంగం! - మీడియా రంగం

భారత మీడియా, వినోద రంగం వాటా 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయనం తేల్చింది. సంప్రదాయ మీడియాలో వృద్ధితోపాటే డిజిటల్‌ మీడియా, ఇంటర్నెట్‌, మొబైల్‌ ప్రకటనలు మరింత విస్తృతమవడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపింది.

MEDIA ENTERTAINMENT
భారత మీడియా, వినోద రంగం వాటా

By

Published : Jun 24, 2022, 5:07 AM IST

భారత్‌లో రానున్న రోజుల్లో మీడియా, వినోద రంగాలు మరింత వృద్ధి సాధించనున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత వార్షిక వృద్ధి రేటు 8.8శాతాన్ని బట్టి చూస్తే.. 2026 నాటికి మీడియా, వినోద రంగాల వాటా రూ.4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. సంప్రదాయ మీడియాలో వృద్ధితోపాటే డిజిటల్‌ మీడియా, ఇంటర్నెట్‌, మొబైల్‌ ప్రకటనలు మరింత విస్తృతమవడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపింది.

2022లో టీవీ ప్రకటనల ఆదాయం రూ.35,270కోట్లుగా ఉండగా.. 2026నాటికి రూ.43,568 కోట్లకు చేరుకోవచ్చు. దాదాపు 23.52శాతం వృద్ధి కనిపించనుంది. అమెరికా, జపాన్‌, చైనా, బ్రిటన్‌ల తర్వాత ప్రపంచంలో ఐదోస్థానం భారత్‌దేనని తాజా నివేదిక పేర్కొంది. 2022లో భారత మీడియా, వినోద రంగాల వాటా దాదాపు రూ.3.14 లక్షల కోట్లుగా ఉందని.. ఈసారి సుమారు 11.4 శాతం వృద్ధి కనిపించిందని పీడబ్ల్యూసీ ‘గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మీడియా ఔట్‌లుక్‌ 2022-2026’ నివేదిక పేర్కొంది.

ఓటీటీ సేవలు.. రానున్న నాలుగేళ్లలో ఓటీటీ వీడియో సర్వీసుల విలువ రూ.21 వేల కోట్లుగా ఉండనుందని ఈ నివేదిక వెల్లడించింది. వీటిలో రూ.19,973 కోట్లు సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా, రూ.1058 కోట్లు వీడియో ఆన్‌ డిమాండ్‌ ద్వారా వచ్చే అవకాశముందని వివరించింది. 2021లో సబ్‌స్క్రిప్షన్‌ల నుంచి 90శాతం ఆదాయం వస్తుండగా.. 2026 నాటికి ఇది 95శాతానికి చేరుకుంటుందని తెలిపింది. ఇక రానున్న రోజుల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఓటీటీ వీడియో మార్కెట్‌ మరింత వృద్ధి చెందుతుందని పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది.

'ఇంటర్నెట్‌ ప్రకటనల జోరు కొనసాగనుంది. 2026 నాటికి 12శాతం వృద్ధి కనిపించి రూ.28,234 కోట్లకు చేరుకుంటుంది. ఇప్పటివరకు ఉన్న ఇంటర్నెట్‌ ప్రకటనల మార్కెట్‌ ఆధిపత్యాన్ని ఇది అధిగమించనుంది. మ్యూజిక్‌, రేడియో అండ్‌ పాడ్‌కాస్ట్‌ విభాగాలు కూడా 2021లో 18శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రస్తుత వృద్ధి రేటును బట్టి చూస్తే 2026 నాటికి ఇది రూ.11,536కోట్లకు చేరవచ్చు. వీడియో గేమ్స్‌, ఈ-స్పోర్ట్స్‌ ఆదాయం కూడా మరో నాలుగేళ్లలో రూ.37,535 కోట్లకు చేరుకుంటుంది'

-పీడబ్ల్యూసీ నివేదిక

భారతీయ సినిమా రంగాన్ని చూస్తే.. 2026 నాటికి 16,198 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇందులో రూ.15,849కోట్లు బాక్సాఫీస్‌ నుంచి కాగా రూ.349 కోట్లు ప్రకటనల నుంచి పొందవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చైనా, అమెరికా తర్వాత మూడో అతిపెద్ద మార్కెట్‌ భారత్‌ సొంతం. భారత్‌లో 2021లో 37.9కోట్ల సినిమా టికెట్లు అమ్ముడుపోయాయి. 2020లో 27కోట్లు అమ్ముడుపోగా అంతకుముందు ఏడాది (2019)తో పోలిస్తే 85శాతం తక్కువ. కొవిడ్‌కు ముందు ఏడాది భారత్‌లో 190కోట్ల టికెట్ల అమ్మకాలు జరిగాయి అని తెలిపింది.

వార్తాపత్రికల విషయానికొస్తే.. దేశంలో 2.7 శాతం వృద్ధిరేటు కనిపిస్తోంది. 2021లో రూ.26,378కోట్ల ఆదాయం తెచ్చిపెట్టగా.. 2026 నాటికి రూ.29,945 కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనాలు వేసింది. రానున్న రోజుల్లో వార్తా పత్రికల కాపీల అమ్మకాలు పెరిగే దేశాల్లో భారత్‌ ఒక్కటే కనిపిస్తోందని అభిప్రాయపడింది. 2026నాటికి నిత్యం సరాసరి 13.9కోట్ల వార్తాపత్రికల కాపీలు అమ్ముడుపోయే అవకాశం ఉందని పీడబ్ల్యూసీ నివేదిక లెక్కకట్టింది.

ఇదీ చూడండి:అదానీ పెద్ద మనసు.. సమాజసేవ కోసం రూ.వేల కోట్లు

ఆర్​బీఐ ఎఫెక్ట్​.. రుణ వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్న బ్యాంకులు

ABOUT THE AUTHOR

...view details