అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూసిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.లక్ష కోట్లకు పైగా లాభాలు ఆర్జించేలా దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ సంస్కరణలకు తోడు, తగిన దిద్దుబాటు చర్యలే ఇందుకు కారణం. ఈ గణాంకాలు చాలు.. పీఎస్‌బీల తీరులో ఎంత మార్పు వచ్చిందో చెప్పడానికి. ఇటీవల ఎన్నడూ లేనంతగా 2017-18లో రూ.85,390 కోట్ల భారీ నష్టాన్ని మూట గట్టుకున్న బ్యాంకులు.. అయిదేళ్ల వ్యవధిలో, ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల భారీ లాభాన్ని ఆర్జించేలా తమ పనితీరును మెరుగు పరచుకున్నాయి. ఒకదశలో బ్యాలెన్స్‌షీట్లు ఆందోళనకరంగా మారడం వల్ల, ప్రభుత్వరంగంలోని 21 బ్యాంకుల్లో 11.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సత్వర దిద్దుబాటు నిబంధనల చట్రంలోకి చేరాయి. అవి జారీ చేసిన మొత్తం రుణాల్లో.. 14.58 శాతం మొండి బకాయిలుగా మారిన రోజులవి.
'దశ తిరిగింది.. దిశ మారింది'.. లాభాలతో దూసుకెళ్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు! - ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రక్షాళన
ప్రభుత్వ రంగ బ్యాంకులకు దశ తిరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు ఆర్జిస్తున్నాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూసిన పీఎస్‌బీలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.లక్ష కోట్లకు పైగా లాభాలు ఆర్జించేలా దూసుకుపోతున్నాయి.
public sector banks profits
కష్టాలకు నేపథ్యం: మూలధనం తక్కువగా ఉండటం, యాజమాన్యాలు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడం, సిబ్బంది అసమర్థతతో విధులు నిర్వర్తించడం అప్పట్లో పీఎస్‌బీలను వేధించిన సమస్యలు. ఫలితంగా ఆయా బ్యాంకుల షేర్ల ధరలు కూడా భారీగా క్షీణించాయి.
ప్రక్షాళన ఇలా
ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ విషయంలో తీవ్రంగా శ్రమించారు.
- 2016-17 నుంచి 2020-21 మధ్య పీఎస్‌బీలకు రూ.3,10,997 కోట్ల మూలధన సాయం అందించారు. రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ ద్వారా వాటి ఆర్థిక స్థితిని మెరుగుపర్చారు.
- 3.38 లక్షల డొల్ల కంపెనీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. ఎగవేతదార్లు, బ్యాంకు రుణాలను వేరే అవసరాలకు మళ్లించిన వారిపై కఠిన చర్యలకు దిగి, తిరిగి వసూలు చేయడం ప్రారంభించారు. భూషణ్ స్టీల్, జెట్ ఎయిర్‌వేస్, ఎస్సార్ స్టీల్, నీరవ్‌మోదీ, రొటొమ్యాక్ వంటి భారీమొత్తం ఎగవేతదార్లతో పాటు యెస్‌బ్యాంక్; డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వంటి ఆర్థిక సంస్థలపైనా చర్యలకు ఉపక్రమించడం వల్ల అందరిలోనూ జవాబుదారీతనం పెరిగింది.
- 2018-19లో రికార్డు స్థాయిలో మొండి బకాయిలు రికవరీ అయ్యాయి. 2017 సెప్టెంబరులో నష్టభయం కలిగిన ఆస్తులు, మొత్తం స్థూల రుణాల్లో 80.3 శాతంగా ఉండగా, 2019 డిసెంబరు నాటికి 63.9 శాతానికి తగ్గాయి.
- ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి, పెద్ద బ్యాంకులుగా మార్చడం వల్ల ప్రస్తుతం 12 పీఎస్‌బీలే మిగిలాయి. ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించే దిశగా అడుగు వేయడం, సంస్కరణలపై ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు అర్థమయ్యేలా చేసింది.
- 2020-21లో లాభాల బాట పట్టిన 9 పీఎస్‌బీలు (ఎస్‌బీఐతో కలిపి) రూ.7,867 కోట్ల డివిడెండ్లను కూడా వాటాదార్లకు ప్రకటించాయి. కొవిడ్ పరిణామాల ఒత్తిళ్తున్నా.. 2021-22లో పీఎస్‌బీలన్నీ కలిపి రూ.66,539 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.
- ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలు రూ.80,000- 1 లక్ష కోట్ల లాభం ప్రకటించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఎ.ఎస్.రాజీవ్ పేర్కొంటున్నారు.
Last Updated : Jan 5, 2023, 6:40 AM IST