తెలంగాణ

telangana

ETV Bharat / business

బీమా పాలసీ తీసుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

insurance policy: కొత్తగా బీమా పాలసీ తీసుకుంటున్నారా? పునరుద్ధరణ కోసం ప్రీమియం చెల్లిస్తున్నారా? క్లెయిం కోసం దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నారా? ఎలాంటి సందర్భంలోనైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆర్థిక నేరాలు బీమా పాలసీల విషయంలోనే అధికంగా ఉంటున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

insurance policy
బీమా పాలసీ

By

Published : Apr 10, 2022, 9:53 AM IST

insurance policy: బీమా సంస్థ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పగానే.. విశ్వసనీయత ఎంత అనే ప్రశ్న మనలో మెదలాలి. ఎలాగైనా మనకు పాలసీ ఇవ్వాలని ఎంతో ఆసక్తిగా వారు ఆ పాలసీని విశ్లేషిస్తుంటారు. మనకు తెలియని వ్యక్తులు చెప్పే వివరాలు ఎంత మేరకు అధీకృతం అనేది పరిశీలించాలి. వారు చెప్పే బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు, ప్రయోజనాలను నమ్మి పాలసీ చేస్తామని చెప్పకూడదు. బీమా సంస్థ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించడం, వెబ్‌సైటును పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి. పాలసీ తీసుకోవాలనే తొందరపాటుతో మోసపూరిత అమ్మకాల బారిన పడొద్దు. ప్రీమియం ధర తక్కువగా పేర్కొంటే.. బీమా సంస్థతో దాన్ని నిర్ధారించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ ప్రతిపాదిత లేదా క్లెయిం ఫారాల మీద సంతకం చేయొద్దు.

ప్రీమియం చెల్లింపులను నగదు రూపంలో కాకుండా చెక్కులు లేదా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయండి. ఏజెంట్లకు నేరుగా నగదును ఇవ్వొద్దని బీమా సంస్థలు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి. నగదు చెల్లించాలనుకుంటే మీరే సొంతంగా వెళ్లి బీమా కార్యాలయంలో జమ చేయండి. మీరు చెల్లించిన ప్రీమియానికి సంబంధించిన రశీదులను తీసుకోవడం తప్పనిసరి. వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి.
పాన్‌ కార్డు, ఆధార్‌, పాస్‌పోర్ట్‌, పాలసీ వివరాల్లాంటివి ఎవరికీ చెప్పొద్దు. ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేసి ఇవ్వొద్దు. ఓటీపీలు, లాగిన్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లు బీమా సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ అడగదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి పాలసీ ఇప్పుడు క్యూఆర్‌ కోడ్‌తో వస్తోంది. పాలసీ వివరాలను ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. మీకు పాలసీ అందగానే ఒకసారి స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్‌ చేసి, వివరాలు పరిశీలించండి. బీమా పాలసీ పత్రాలను పూర్తి చేసేటప్పుడు ప్రతి విషయాన్నీ తెలుసుకోండి. పాలసీ నిబంధనలు మరోసారి అడగండి. పూర్తి చేయని ప్రతిపాదిత పత్రంపై సంతకాలు చేయొద్దు.

ఇదీ చదవండి:'త్వరలో కొత్త పింఛన్​ ప్లాన్​.. కనీస రాబడి వచ్చేలా'

ABOUT THE AUTHOR

...view details