Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY : కేంద్ర ప్రభుత్వం.. అల్పాదాయ వర్గాల వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను (PMSBY) ప్రవేశపెట్టింది. ఇది ప్రభుత్వ స్కీమ్ కనుక.. దీని వల్ల పేద, దిగువ, మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలవారికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో రూ.20 కట్టడం ద్వారా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవర్‌ను పొందవచ్చు. అందుకే ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ పథకానికి అర్హులు ఎవరు?
PMSBY SchemeEligibility : 18 ఏళ్లు నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు అందరూ ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులే. అయితే ఇందు కోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు ఉంటే.. అప్పుడు మీరు ఏదైనా ఒక్క బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఖాతా ఉంటే.. ఆ ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు. ఎన్ఆర్ఐలు కూడా పీఎంఎస్బీవై పథకంలో చేరేందుకు అర్హులు. కానీ క్లెయిమ్‌ను మాత్రం లబ్ధిదారునికి లేదా నామినీకి భారత కరెన్సీలో చెల్లిస్తారు.
ప్రీమియం ఎంత చెల్లించాలి?
PMSBY Scheme Premium : పీఎంఎస్బీవై పథకంలో వార్షిక ప్రీమియంగా కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవానికి ఈ ప్రీమియం మొత్తాన్ని PMSBY పథకానికి అనుసంధానం చేసిన మీ బ్యాంకు అకౌంట్ నుంచి డెబిట్ చేస్తారు. ప్రతి సంవత్సరం జూన్ 1 తరువాత ఆటో డెబిట్ పద్ధతి ద్వారా మీ ఖాతా నుంచి ఈ బీమా ప్రీమియంను కట్ చేస్తారు. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ఏటా దీనిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY : వాస్తవానికి ప్రతి సంవత్సరం జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా చందాదారులు.. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పథకంలో చేరినట్లు అయితే.. క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు అకౌంట్‌కు మాత్రమే చెల్లిస్తారు. అంటే ఇతర బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లించిన ప్రీమియాన్ని మీరు కోల్పోయినట్లే అవుతుంది.
వాస్తవానికి ప్రీమియం అన్నది మీరు క్లెయిమ్ చేసిన దాని ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే ఊహించని ప్రతికూల ఫలితాలను మినహాయిస్తే.. మొదటి మూడేళ్లలో ప్రీమియంలో ఎలాంటి మార్పులు ఉండవు. మరో ముఖ్యమైన విషయం చందాదారులకు బ్యాంకులు ఈ పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికేట్‌ను జారీ చేయవు.
బెనిఫిట్స్
PMSBY Scheme Benefits :
- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురి అయినా, బాధిత కుటుంబానికి లేదా నామినీకి రూ.2,00,000 అందించడం జరుగుతుంది.
- ఒక వేళ పాలసీదారుడు పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం అందిస్తారు.
- ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా లేదా రెండు చేతులు/ కాళ్లు కోల్పోయినా.. దానిని శాశ్వత వైకల్యంగా గుర్తించి రూ.2 లక్షలు పరిహారంగా అందిస్తారు.
- ఒక కాలు లేదా ఒక చెయ్యి, ఒక కంటి చూపు కోల్పోతే మాత్రం దానిని పాక్షిక వైకల్యంగా గుర్తించి రూ.1 లక్ష రూపాయలు పరిహారంగా ఇస్తారు.
నోట్ : చందాదారులు ఈ పీఎంఎస్బీవై పథకంతో పాటు అదనంగా హెల్త్ పాలసీలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మెడిక్లెయిమ్ పాలసీ కాదు. అందువల్ల ఈ పథకం ద్వారా మీకు ఎలాంటి ఆసుపత్రి ఖర్చులు తిరిగిరావు. కేవలం ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత, పాక్షిక వైకల్యం కలిగినప్పుడు మాత్రమే పరిహారం పొందే అవకాశం ఉంటుంది.
బీమా ఎప్పుడు వర్తిస్తుంది?
PMSBY Scheme Claim : సహజ విపత్తుల వల్ల జరిగిన ప్రమాదాల వల్ల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం వర్తిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది.