Post Office Monthly Income Scheme : రిస్క్ లేని పెట్టుబడి మార్గం వెతికే వారికి పోస్ట్ ఆఫీస్ అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలు మంచి భరోసానిస్తున్నాయి. ఈ పోస్టల్ పథకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. కనుక మన డబ్బు నష్టపోతామనే ఆందోళన ఉండదు. ప్రస్తుత కాలంలో పెరిగిన ఖర్చులతో పొదుపు చేయడం గగనమైపోతోంది. అందుకే పోస్టల్ డిపార్ట్మెంట్ చిన్నమొత్తాల పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ ఒకటి. విశ్రాంత జీవితంలో నెలవారీ ఖర్చుల కోసం ఈ పోస్టల్ సేవింగ్ స్కీమ్ మంచిగా ఉపయోగపడతుంది. అంతేకాదు ఈ పోస్టల్ పథకంలో భార్యభర్తలు ఇద్దరూ ఉమ్మడి ఖాతాను కూడా తెరిచి మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నెలవారీ ఆదాయం!
మీరు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో డిపాజిట్ చేయడం ద్వారా ప్రతినెలా రాబడిని పొందవచ్చు. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లు. ఆసక్తి ఉన్న ఎవరైనా సింగిల్, జాయింట్ అకౌంట్లను తెరవొచ్చు. వాస్తవానికి ఈ అక్టోబర్ నుంచి ఈ స్కీమ్ వడ్డీ రేట్లు పెంచారు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నారు. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి.
ఎంత డిపాజిట్ చేయవచ్చు?
చిన్నమొత్తాల పొదుపు అంటే గుర్తుకు వచ్చే పోస్టల్ పొదుపు పథకాల్లో గరిష్ట పెట్టుబడిపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనే సందేహాలు వస్తుంటాయి. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.9 లక్షలు వరకు డిపాజిట్ చేయవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు వరకు మదుపు చేయవచ్చు.
జాయింట్ అకౌంట్ బెనిఫిట్స్!
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో సింగిల్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. లేదంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ప్రతి జాయింట్ అకౌంట్ హోల్డర్ సమాన భాగాన్ని అందుకుంటారు. ఇక డిపాజిట్స్ విత్ డ్రా విషయానికి వస్తే, మొదటి మూడేళ్లలోపు ఈ స్కీమ్ నుంచి మీరు విత్‌డ్రా అయితే, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి 2 శాతాన్ని మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని అందిస్తారు. అదే మూడేళ్ల తర్వాత విత్ డ్రా చేసుకుంటే, మొత్తం డిపాజిట్ నుంచి 1 శాతాన్ని మినహాయించుకుని, మిగతా సొమ్మును మీకు చెల్లిస్తారు.