Fixed Deposit Interest Rates : మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి నేడు అనేక పెట్టుబడి అవకాశాలున్నాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. చాలా మంది సీనియర్ సిటిజన్లు, పదవీ విరమణ చేసిన వారు ఇదే బెస్ట్ చాయిస్ అని పరిగణిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వారు తమ పదవి విరమణ అనంతరం నిధులను ఎఫ్డీలో జమ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎఫ్డీకి ఏది అయితే బెటర్ అని ఆలోచిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి బ్యాంకు అయితే బెటరని కొందరు, పోస్టాఫీసు మంచి ఎంపిక అని మరికొందరు.. ఇలా ఎవరికి తోచింది వాళ్లు చెబుతారు. అయితే.. మీరు గనుక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎఫ్‌డీ స్కీమ్‌లో లేదా పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే వాటికి సంబంధించిన వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఆగస్టు 15 వరకే..
SBI Fixed Deposit Rates : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ సాధారణ వినియోగదారులకు అందించే ఎఫ్‌డీ పథకాల వ్యవధి 7 రోజుల నుంచి 10 సంవ్సతరాల వరకు ఉంటుంది. వీటిపై వడ్డీ రేట్లు 3 నుంచి 6.5 శాతం వరకు ఉంటాయి. అదే సీనియర్ సిటిజన్లు వీటిపై అధిక వడ్డీ పొందుతారు. వారికి వడ్డీ 3.5 నుంచి 7.5 శాతం వరకు వస్తుంది. ఎస్‌బీఐ తమ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం అమృత్ కలశ్ (444 రోజుల ఎఫ్‌డీ) పై సాధారణ కస్టమర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్ వినియోగదారులకు 7.6 శాతం వడ్డీ అందిస్తుంది. కానీ ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15 వరకే అందుబాటులో ఉంటుంది.