ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మరణించినా లేదా వైకల్యం పొందినా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అతి తక్కువ ప్రీమియం చెల్లింపుతోనే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే ఈ స్కీం ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 34.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. అందులో 1.15 లక్షల కుటుంబాలు 2,302 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధిని పొందాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- అర్హత..
- PMSBY Scheme Eligibility : ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరేందుకు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు అర్హులు.
- బ్యాంకు/ పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారెవరైనా ఈ స్కీంలో చేరొచ్చు.
- ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాలి. ఒక వేళ అనుసంధానం చేయకపోతే కేవైసీ చేయించడం తప్పనిసరి.
- ఒక వేళ వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉన్నట్లయితే.. ఏదైనా ఒక సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే స్కీంకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- రెండింటి ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ.. ఒకదాన్ని మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
- ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు సైతం ఈ స్కీంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.
- భారత్‌లో సేవింగ్ అకౌంట్ ఉన్న ఎన్నారైలు కూడా ఈ పథకంలో చేరేందుకు అర్హులు.
నమోదు కాలవ్యవధి..
ఈ స్కీం ఏడాది కాలపరిమితితో వస్తుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమలులో ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా ప్రీమియం మొత్తం ఆటో డెబిట్ ద్వారా రెన్యువల్ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే.. రద్దు చేయాల్సిందిగా బ్యాంకును కోరాల్సి ఉంటుంది. కొత్తగా ఈ స్కీంలో చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది.
నామమాత్రపు ప్రీమియమే..
PMSBY Scheme Time Period : సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. ఈ సురక్షా బీమా పథకాన్ని నామమాత్రపు ప్రీమియంతోనే తీసుకొచ్చింది. పథకాన్ని ప్రారంభించిన మొదట్లో కేవలం 12 రూపాయల ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. గతేడాది నుంచి ఈ ప్రీమియంను 20 రూపాయలకు పెంచారు. ఆటోడెబిట్ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు అకౌంట్ నుంచి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీంలో చేరేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలి.